జగన్‌ ఖాతాలో గ్యారెంటీ

26 Mar, 2019 09:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తమిళనాడుకు సరిహద్దు నియోజకవర్గం నగరి. అందుకే ఇటు తెలుగు.. అటు తమిళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తారు. నియోజకవర్గం ఏర్పడక ముందు తమిళనాడులోని తిరుత్తణి, నగరి కలిసి తిరుత్తణి తాలుకాలో ఉండేది. ఆ సమయంలో ఈ తాలుకాకు ఇద్దరు శాసనసభ్యులుండేవారు. నగరి అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఇక్కడినుంచి గెలిచిన శాసన సభ్యుడు తమిళనాడు అసెంబ్లీకే వెళ్లేవారు. సరిహద్దు నియోజకవర్గాల్లో ఎదురయ్యే సమస్యలు అధికం కావటం.. పరిష్కారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో 1961లో పటాస్కర్‌ అవార్డుతో నగరి నియోజకవర్గం ఆవిర్భవించింది. దీంతో తొలిసారి నగరి నియోజకవర్గానికి 1962లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆర్‌కే రోజా, టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌ బరిలో ఉన్నారు.

పునర్విభజన తర్వాత..
2009 పునర్విభజనకు ముందు నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఉండేవి. పునర్విభజన తర్వాత నగరి, పుత్తూరు మునిసిపాలిటీగా ఏర్పడ్డాయి. అంతకుముందు నగరి, పుత్తూరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉండేవి. ప్రస్తుతం నగరి, పుత్తూరు, వడమాలపేట, విజయపురం, నిండ్ర మండలాలతో కలిపి నగరి నియోజకవర్గంగా ఉంది. అందుకే ఇక్కడి ప్రజలపై తమిళ సినీనటులు, అక్కడి నాయకుల ప్రభావం అధికంగా ఉంది. నగరి నియోజకవర్గ ప్రజలు చేనేత, నూలు వస్త్రాల తయారీ, మామిడి, చెరుకు సాగుపైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.

గత ఎన్నికల చరిత్ర
1962లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థి గోపాల్‌రాజు కాంగ్రెస్‌ అభ్యర్థి గోపాల్‌నాయుడిపై గెలుపొందారు. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 7 పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మూడుసార్లు టీడీపీ, ఒకసారి వైఎస్సార్‌సీపీ గెలుపొందారు. రెడ్డివారి చెంగారెడ్డి 8 దఫాలు పోటీచేసి ఐదుసార్లు విజయం సాధించారు.

సినీ కళాకారులను ఆదరించిన నగరి
నిర్మాత వీఎంసీ దొరస్వామిరాజు 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలవగా, రెండోసారి 1999లో ఓడిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ సినీ రంగంలో హీరోయిన్‌గా 
వెలుగొందిన ఆర్‌కే రోజా 2004లో పరాజయం పాలయ్యారు. 2014లో విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌కే రోజా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడిపై సంచలన విజయం సాధించారు.

టీడీపీకి సొంత ఇంటిలోనే వ్యతిరేకత
నగరి అసెంబ్లీలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొని ఉంది. వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థిగా ఆర్‌కే రోజా మరోసారి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ పోటీ చేస్తున్నారు. ఇతని అభ్యర్థిత్వం పట్ల కన్నతల్లి ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, సోదరుడు జగదీష్‌ వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా సొంత పార్టీలో అసంతృప్తులు, మరోవైపు జన్మభూమి కమిటీల దాష్టీకాలు, స్థానిక ప్రజాప్రతినిధులపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్‌కే రోజా దూసుకెళ్తుండగా, అసమ్మతిని చల్లార్చే పనిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ తలమునకలై ఉన్నారు. 

వార్‌ వన్‌ సైడ్‌..!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా మరోసారి విజయపథాన దూసుకెళ్తున్నారు. ఐదేళ్లూ టీడీపీ ప్రభుత్వం నగరి నియోజకవర్గంపై వివక్ష చూపింది. అదే విధంగా మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆమె అనుచరులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సొంత నిధులతో నియోజకవర్గంలో ఆమె పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ‘రాజన్న క్యాంటిన్‌’ ప్రారంభించి భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు రూ.2లకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.  

ఓటర్ల వివరాలు
మొత్తం 1,86,227 
పురుషులు 91,720  
మహిళలు 94,495
ఇతరులు: 12 

– తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి

మరిన్ని వార్తలు