కాంగ్రెస్‌కు షాకిచ్చిన విపక్షాలు..!

13 Jan, 2020 10:48 IST|Sakshi

అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు డుమ్మా

సాక్షి, న్యూఢిల్లీ : వరస ఎన్నికల్లో ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి విపక్షాలు కోలుకోలేని షాకులిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని తలపెట్టింది. అయితే ఈ కీలక భేటీకి హాజరయ్యేంది లేదంటూ దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలు తెల్చిబెతున్నాయి. ఈ సమావేశానికి తాము హాజరయ్యేది లేదంటూ తొలుత తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ప్రకటించారు. ఆ తరువాత బీఎస్పీ చీఫ్‌ మాయావతి కూడా అదే ప్రకటన చేశారు. తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా వారి బాటలోనే నడిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన శివసేన కూడా గైర్హాజరు కావడం గమనార్హం. కాంగ్రెస్‌ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకావడం లేదంటూ మొండిచేయి చూపారు. కాగా కాంగ్రెస్‌ నేతలపై మాయావతి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బహిరంగ విమర్శలకు దిగుతోన్న విషయం తెలిసిందే.
 
నేడు జరిగే ఈ భేటీలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో పాటు ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జేఎన్‌యూ హింసపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే కీలకమైన సమావేశానికి ప్రధాన పార్టీలు గైర్హాజరు కావడంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, ఎస్పీ మాత్రమే ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తొలినుంచి ప్రచారం సాగిన.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. 

మరిన్ని వార్తలు