ఇక నుంచి ఒంటరి పోరే

25 Jun, 2019 04:02 IST|Sakshi

ఎన్నికల్లో పొత్తు పెట్టుకోం

బీఎస్పీ నేత మాయావతి స్పష్టీకరణ

లక్నో: ఇక ముందు జరిగే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయావతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు చిన్నవైనా, పెద్దవైనా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సోమవారం లక్నోలో ఆమె ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కలిసి పోటీ చేశాయి. అయితే, అనుకున్న మేరకు ఫలితాలు దక్కలేదు. దాంతో వీరి పొత్తు కొనసాగే విషయం చర్చనీయాంశమైంది. మాయావతి తాజా ప్రకటనతో ఎస్పీతో పొత్తు ఉండదని తేలిపోయింది. ‘2012 నుంచి 2017 వరకు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ బీఎస్పీకి వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా పదోన్నతుల్లో రిజర్వేషన్ల వంటి పలు నిర్ణయాలు తీసుకుంది.

ఎస్పీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. వాటినన్నిటినీ మరిచి దేశప్రయోజనాల కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నాం. అయితే, ఎన్నికల తర్వాత ఎస్పీ వైఖరి మమ్మల్ని ఆలోచించుకునేలా చేసింది. ఈ పొత్తుతో భవిష్యత్తులో బీజేపీని ఓడించడం సాధ్యం కాదనిపిస్తోంది. అందుకే ఇకపై పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’ అని మాయావతి హిందీలో ట్వీట్‌ చేశారు. దళితులు సమాజ్‌వాదీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు చేరువవుతున్నారన్న కోపంతోనే మాయావతి తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎస్పీ నేత రామ్‌శంకర్‌ అన్నారు. మాయవతి నిర్ణయంతో తమకేసంబంధం లేదని గఠ్‌బంధన్‌లో మరో భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్‌ పేర్కొంది.

మాయావతి తీరింతే
ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న మాయావతి ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు తెగతెంపులు చేసుకుంటారో అర్థం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన మూడ్‌ను బట్టి ఆమె నిర్ణయాలు తీసుకుంటారని వారన్నారు. 1993లో ఆమె మొదటిసారి ఎస్పీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. రెండేళ్ల తర్వాత కటీఫ్‌ చెప్పారు. 1995లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత 4నెలలకే దానికి టాటా చెప్పేశారు. 1996లో కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. 1997లో బీజేపీతో కలిసి పోటీ చేసి సీఎం అయ్యారు. 2002లో బీజేపీతో జతకట్టారు. మూడునెలల్లోపే పొత్తును విచ్ఛిన్నం చేశారు. 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని లాభం పొందారు. 2019లో ఆ పొత్తు కొనసాగించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ కంటే బీఎస్పీ ఎక్కువ లాభపడింది. అయినాసరే ఇప్పుడు ఎస్పీతో పొత్తును తెంచేసుకున్నారు.

మరిన్ని వార్తలు