దేశద్రోహ చట్టాన్ని తొలగిస్తారా? రాహుల్‌పై కేసు నమోదు!

8 Apr, 2019 10:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆగ్రా కోర్టులో కేసు నమోదైంది. దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరచడాన్ని సవాలుచేస్తూ న్యాయవాది నరేంద్ర శర్మ కోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 55 పేజీలతో కూడా ఎన్నికల మ్యానిఫెస్టోని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో తామ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత శిక్షాస్మృతి(ఐపీసీ) లోని దేశ ద్రోహ చట్టం 124ఎను తొలగిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈమేరకు న్యాయవాది పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఏప్రిల్ 16న విచారణ జరుపుతామని తెలిపింది.

బ్రిటీష్‌ కాలంనాటి చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం దేశంలోని మేధావులు, విద్యార్థులపై బలవంతంగా ప్రయోగిస్తోందని రాహుల్ పలుమార్లు విమర్శించారు. ఈమేరకు దానిని తొలగిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. ఉగ్రవాదులంతా దేశంలో ఉండిపోవాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశ ద్రోహ చట్టాన్ని తొలగిస్తే శాంతిభద్రతలు మరింత అద్వాన్నంగా తయారవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా దేశానికి వ్యతికంగా నినాదాలు చేసినా.. విద్వేషాన్ని ప్రదర్శించిన వారిని దేశద్రోహ చట్టం కింద అరెస్ట్‌ చేయడమే సెక్షన్‌ 124ఎ స్వరూపం.

మరిన్ని వార్తలు