నీతి ఆయోగ్‌తో లాభం లేదు

18 Jun, 2018 02:35 IST|Sakshi

సహకార సమాఖ్యకు విఘాతం

బీజేపీయేతర సీఎంల మండిపాటు

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు (విపక్ష పార్టీలు) తమ ఐక్యతను ప్రదర్శించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై అంశాల వారీగా విమర్శలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక, కేంద్ర నిధుల పంపిణీ తదతర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని. ఏదో జరుగుతుందని కూడా తాము భావించడం లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘రాష్ట్రాల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందా? ప్రతి రాష్ట్రానికి వేర్వేరు సమస్యలున్నాయి.

కేంద్రం విధివిధానాలను నిర్ణయిస్తుంది. కానీ అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే కదా. కేంద్రం సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించాలి. రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు’ అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతు రుణమాఫీని సమావేశంలో లేవనెత్తారు. రైతు రుణమాఫీలో 50 శాతం సాయాన్ని కేంద్రమే భరించాలని కర్ణాటక సీఎం కుమారస్వామి కోరారు.  15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ కోరారు. ‘కేంద్రం విడుదల చేసే నిధులు రాష్ట్రాలకు సమానంగా చేరేందుకు.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలి’ అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు