10న ‘ఛలో వంశధార’ ఆందోళన

27 Sep, 2017 03:59 IST|Sakshi

అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం

సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌ సీపీ, 10 లెఫ్ట్‌ పార్టీలు   

సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా అక్టోబర్‌ 10వతేదీన ‘ఛలో వంశధార’ ఆందోళన   కార్యక్రమం చేపట్టాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజ్ఞప్తి మేరకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ సీపీ సహా పది వామపక్ష పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం అరెస్ట్‌లకు దిగితే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం విజయవాడలో మధు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రావుల వెంకయ్య, ఇతర నాయకులు బి.వెంకటరెడ్డి, వై.కేశవరావు, కె.రామారావు, కిషోర్, డి.హరినాథ్, పి.వి.సుందరరాజు, దడాల సుబ్బారావు తదితరులు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ భూ నిర్వాసితులపై ఇంత నిర్భంధం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వాలు చట్టపరిధిలో వ్యవహరించాలని సూచించారు. ఆందోళనను వంశధార, పోలవరం ప్రాజెక్టులకే పరిమితం చేయవద్దన్నారు. రాష్ట్రంలో భూ సేకరణ చట్టప్రకారం జరగడం లేదని, వంశధార ప్రాజెక్టు సమస్య ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. విపరీతమైన జాప్యం వల్ల రూ.933 కోట్ల ప్యాకేజీ ఇప్పుడు రు.1,616 కోట్లకు చేరిందని చెప్పారు. కాంట్రాక్టర్లకు పెంచినట్లుగా నిర్వాసితులకు పరిహారం ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు.  

16, 17న విజయవాడలో 30 గంటల ధర్నా 
2013 భూ సేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కె.రామకృష్ణ పేర్కొన్నారు. మరో 7,200 మంది నిర్వాసితుల పునరావాసానికి స్థలాలు ఇవ్వాల్సి ఉందని వంశధార నిర్వాసితుల సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై వచ్చే నెల 16, 17వ తేదీల్లో విజయవాడలో 30 గంటలపాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మధు ప్రకటించారు. నిర్వాసితులకు 36 రకాల పునరావాస సేవలు కల్పించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు