నేడు రాష్ట్రానికి చంద్రబాబు

25 May, 2020 03:57 IST|Sakshi

అనుమతిచ్చిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఈ–పాస్‌తో పాటు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పంపిన డీజీపీ

విశాఖ పర్యటన రద్దు.. నేరుగా ఉండవల్లికి చంద్రబాబు

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి రావడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అనుమతినిచ్చారు. రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన డీజీపీ.. ప్రత్యేక పరిస్థితి(స్పెషల్‌ కేస్‌)గా పేర్కొంటూ ఈ–పాస్‌కు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో రెండు నెలల తర్వాత చంద్రబాబు సోమవారం రాష్ట్రానికి రానున్నారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి విమానంలో నేరుగా విశాఖకు వెళ్లి ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించాల్సి ఉంది. అక్కడికి విమాన సర్వీసులు రద్దు కావడంతో చంద్రబాబు పర్యటన కూడా రద్దయిందని విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరి చంద్రబాబు రోడ్డు మార్గంలో ఉండవల్లి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ–పాస్‌తో పాటు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కూడా డీజీపీ రాతపూర్వకంగా జత చేసి చంద్రబాబుకు పంపించారు. ఆ మార్గదర్శకాల్లో డీజీపీ సవాంగ్‌ ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి..

► లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు (మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు), గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి.  
► రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అత్యవసర సర్వీసులు మినహా ఎటువంటి ప్రజారవాణాకు, ప్రజలు తిరగడానికి అనుమతిలేదు.  
► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వ్యక్తులు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం విధిగా వైద్య పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలి.  
► ఈ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పర్యటించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతిస్తున్నాం. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు సహకరించాలి.

చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకునే కుట్ర
చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దీని వెనుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కుట్ర ఉందని ఒక ప్రకటనలో ఆరోపించారు. సోమవారం ఒక్క రోజే ఏపీకి విమాన సర్వీసులను బంద్‌ చేయడం కుట్రలో భాగమేనని తెలిపారు. 

మరిన్ని వార్తలు