ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో మోసం

17 Apr, 2019 04:47 IST|Sakshi

ఈవీఎంల గారడీ

పథకం ప్రకారం మోదీ కుట్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మొన్న తెలంగాణ, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. అవి పూర్తిగా మోసపూరిత ఎన్నికలు’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌నాడు వినియోగించిన ఈవీఎంలలో ఈ మోసం చోటు చేసుకుందని చెప్పారు. ఈ మోసానికి సూత్రధారి కేంద్రంలోని మోదీ అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశానని తెలిపారు. ‘తమిళనాడును పరిపాలించేది అన్నాడీఎంకే కాదు, నరేంద్రమోదీ. అన్నాడీఎంకేకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లే.

ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. తమిళనాడులో తెలుగు, తమిళ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి సఖ్యతగా ఉన్నారు. తమిళనాడు ప్రజల కోసం ఎంజీఆర్, కరుణానిధి ఎంతో పాటుపడ్డారు. ప్రజలకు ఎలా మేలు చేయవచ్చో మోదీ వీరిని చూసి నేర్చుకోవాలి. కరుణానిధి వారసుడిగా స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వెయ్యిశాతం విజయం మాదేనని ఇందులో సందేహాలకు తావులేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంలలో ఓట్లు తారుమారు అయినాయి. ఎన్నికలను సక్రమంగా జరిపించడంలో ఈసీ ఘోరంగా విఫలమైంది.  ఈవీఎంల పనితీరుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు