వైఎస్సార్‌సీపీది నేర ప్రవృత్తి

2 Sep, 2018 03:49 IST|Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు 

ముస్లింలంతా టీడీపీ వైపు మళ్లడం చూసి ఓర్వలేకపోతోంది 

అల్లర్లను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని కుట్రలు పన్నుతోంది

వైఎస్సార్‌సీపీ వల్లే రాజకీయాల్లో ఇలాంటి పెడధోరణులు

సాక్షి, అమరావతి: ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సదస్సు విజయవంతమైందని, ముస్లింలంతా తెలుగుదేశం పార్టీ వైపునకు మళ్లడం చూసి ప్రతిపక్షం అక్కసు వెళ్లగక్కుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఏదోవిధంగా అల్లర్లను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని కుట్రలు చేస్తోందని, వైఎస్సార్‌ సీపీ కుట్రల ట్రాక్‌ రికార్డు అందరికీ తెలిసిందేనని మండిపడ్డారు. చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్‌లో టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో చెరుకు తోటలు, అరటి తోటలు తగులపెట్టి ఆ నిందను రైతులపైకి తోసేశారని, తునిలో రైలును దహనం చేసి ఆ నేరాన్ని అమాయకులైన కాపులపైకి నెట్టాలని చూశారని, గుంటూరులో పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి ఆ చర్యను ముస్లింలపైకి నెట్టారని, ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలోనూ అల్లర్లు సృష్టించి అమాయకులైన ముస్లింలను కేసుల్లో ఇరికించడం వైఎస్సార్‌సీపీ నేర ప్రవృత్తికి నిదర్శనమని ఆరోపించారు.

గతంలోనూ జల్లికట్టు స్ఫూర్తి అని చెప్పి విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన రభసను గుర్తుంచుకోవాలన్నారు. ‘కాబోయే సీఎం నేనే, మీ అందరినీ గుర్తుంచుకుంటా, శంకరగిరి మాన్యాలకు పంపిస్తా’ అని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ను బెదిరించడం, నూజివీడు ఆస్పత్రిలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను జైలుకు పంపిస్తాననడం జగన్‌ అహంభావానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. గుంటూరులో నిర్వహించిన టీడీపీ మైనార్టీ సదస్సుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పంపడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు వెళ్లి అల్లరి సృష్టించడం ఎప్పుడైనా జరిగిందా? అని నిలదీశారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికి జగన్‌తగడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పెడధోరణులన్నీ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాతే జరుగుతున్నాయని, అందుకే టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. 

త్వరలో బీసీల సదస్సు
త్వరలోనే పెద్దఎత్తున బీసీల సదస్సు నిర్వహించాలని, దీనికి ఉత్తరాంధ్ర వేదిక కావాలని సీఎం  పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఐదు ధర్మపోరాట సదస్సులు నిర్వహించామని, ఆరో సదస్సును పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిద్దామని చెప్పారు. వచ్చే జనవరి కల్లా మరో ఆరు సభలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ సభల ద్వారా బీజేపీ, వైఎస్సార్‌సీపీల లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెలలోనే ప్రాజెక్టుల సందర్శన, జలసిరికి హారతి కార్యక్రమాలను చేపడతాని తెలిపారు. 46 రోజుల్లో ‘గ్రామవికాసం’ కార్యక్రమం 18% మాత్రమే జరిగిందన్నారు. ఈ నెల 5న టీడీపీ విస్తృస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు