తెలుగు మహిళపై చంద్రబాబు యుద్ధం

16 Apr, 2019 03:26 IST|Sakshi
మండ్య సభలో చంద్రబాబు, సీఎం కుమారస్వామి మాటామంతీ

మండ్యలో సుమలతను ఓడించాలని ప్రచారం 

భగ్గుమన్న తెలుగు ప్రజలు

సాక్షి బెంగళూరు/ యశవంతపుర (బెంగళూరు): అలనాటి నటి, ఇటీవల భర్తను కోల్పోయిన తెలుగింటి ఆడబిడ్డ సుమలతను ఎన్నికల్లో ఓడించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. తన భర్త అంబరీష్‌ ఆశయ సాధన కోసం మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆమెకు మద్దతుగా నిలబడడానికి బదులు ఓడించేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. మండ్యలో కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ తరఫున చంద్రబాబు ప్రచారానికి దిగనున్నారు. దీనిపై కన్నడనాట ఉన్న తెలుగువారి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేనా 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయం అని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం చంద్రబాబు నిఖిల్‌ తరఫున మండ్య సమీపంలోని పాండవపురంలో ప్రచారం చేశారు. 

చంద్రబాబు ప్రభావం ఉండదు: సుమలత 
ఏపీ సీఎం చంద్రబాబు మండ్యకు వచ్చి జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదని నటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత స్పష్టం చేశారు. సోమవారం ఆమె మండ్య పరిధిలోని మంచనహళ్లిలో ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. మండ్యలో తెలుగువారు లేనందున చంద్రబాబు జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసినా ఆయన ప్రభావం ఏమీ ఉండదన్నారు.   

ప్రధాని పదవికి వన్నె తెచ్చిన దేవెగౌడ 
కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఓటర్లను కోరారు. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, సీఎం కుమారస్వామిలకు మద్దతుగా సోమవారం సాయంత్రం ఆయన మండ్య లోక్‌సభ నియోజకవర్గంలోని పాండవపురలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. దక్షిణ భారత్‌కు దేవెగౌడ పెద్దదిక్కు అని, దేశం కోసం ఆయన ప్రధాని పీఠం చేపట్టి.. ఆ పదవికే వన్నె తెచ్చారని పొగడ్తలు గుప్పించారు. తొలుత కన్నడలో కొన్ని పదాలు మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. మండ్యలో దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పతనమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, బీజేపీని గెలిపిస్తే దేశం నాశనం అవుతుందని, ప్రధాని మోదీ, అమిత్‌షా అవినీతిపరులని ధ్వజమెత్తారు. మోదీనే మరోసారి ప్రధాని కావాలంటూ శత్రు దేశమైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ దేశంతో కలసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని, ఈ ఎన్నికల్లో మోదీ ఓడిపోయి గుజరాత్‌కు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు