ట్రంప్‌పైనా పోరాడతా

9 Apr, 2019 04:58 IST|Sakshi

కేసీఆర్‌ను బట్టలు ఊడదీసి ఉతికి ఆరేశా..

మోదీ, కేసీఆర్, జగన్‌ వచ్చినా దీటుగా ఎదుర్కొనే దమ్ముంది 

కృష్ణాజిల్లా ప్రచారసభల్లో చంద్రబాబు

సాక్షి, మచిలీపట్నం/పెడన/పామర్రు/తిరువూరు: ఆంధ్రులకు అన్యాయం చేస్తే కేసీఆరే కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంపు మీద అయినా పోరాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఆంధ్రుల కోసం కూడా పోరాటం చేస్తానన్నారు. ఆయన సోమవారం కృష్ణాజిల్లా తిరువూరు, మచిలీపట్నం, పెడన, పామర్రుల్లో ఎన్నికల ప్రచారసభల్లో ప్రసంగించారు.  మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కూడా ఆయన వెంట ఉన్నారు. చంద్రబాబు పెడనలో మాట్లాడుతూ ‘కేసీఆర్‌ను బట్టలు ఊడదీసి ఉతికి ఆరేశా.. హైదరాబాద్‌ తన సొత్తులాగా నడుచుకుంటున్నాడు.. హైటెక్‌ సిటీని నేనే నిర్మించా.. నేను దద్దమనే.. నువ్వు కట్టింది ఒక్కటైనా ఉంటే చెప్పు..’ అంటూ కేసీఆర్‌ను విమర్శించారు. జగన్‌కు ఓటు వేస్తే కేసీఆర్‌ను గెలిపించినట్లేనన్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్‌ పార్టీ కోరటం రౌడీయిజం చేయడానికని ఆరోపించారు. బందరు సభలో జగన్, మోదీ, కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు గుప్పించారు. తప్పుడు సర్వేలతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారన్నారు. పోలవరం ఆపేందుకు, కృష్ణా జలాలను నిలిపేసేందుకు కేసీఆర్‌ కోర్టులో వేసిన కేసుల్ని విత్‌డ్రా చేసుకుంటే అప్పుడొచ్చి మాట్లాడతానని చెప్పారు. మోదీని ఢిల్లీ నుంచి గుజరాత్‌కు పంపిస్తానన్నారు. పామర్రు సభకు సాయంత్రం 6.30 గంటలకు సీఎం చంద్రబాబు వచ్చేసమయానికే ఎక్కువమంది మహిళలు వెళ్లిపోయారు. 

జగన్‌ హామీ మళ్లీ కాపీ..
బందరు జ్యువెలరీ పార్కులో సమస్యలను పరిష్కరిస్తానని, విద్యుత్‌ యూనిట్‌ను రూ.3.50 చార్జీకే ఇస్తామని సోమవారం ఉదయం జరిగిన రోడ్‌షోలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీనే.. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే చేస్తానని ప్రచారసభలో చెప్పారు. 

మరిన్ని వార్తలు