టీడీపీఎల్పీ నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక

29 May, 2019 11:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో బుధవారం తెలుగుదేశం శాసనసభాపక్ష (టీడీఎల్పీ) భేటీ జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబునాయుడిని పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

బాబు యూటర్న్‌..
శానసభలో తన నేత ఎంపికపై తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపక్షనేత పాత్రను పోషించేందుకు మొదట వెనుకడుగు వేసి వైరాగ్యాన్ని ప్రదర్శించినా తాజాగా దాన్ని వదులుకునేందుకు ఇష్టపడదని తెలిసింది. కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీపై పట్టుపోతుందని తానే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించాలని బాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో పలువురు సీనియర్లు, నాయకులు మాత్రం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రతిపక్ష నేతగా కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు తీవ్ర మనో వేదనకు గురై తాను ప్రతిపక్ష బాధ్యతలు చేపట్టలేనని పార్టీ ముఖ్య నాయకుల వద్ద తన అశక్తతను వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుండడం, ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి, మెజారిటీ ఎమ్మెల్యేలు తన కంటే చిన్నవయసు వారు కావడంతో అసెంబ్లీలో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది.  అయితే, చివరకు ఈ విషయంలోనూ బాబు యూటర్న్‌ తీసుకున్నారని తాజా పరిణామాలు చాటుతున్నాయని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు