చంద్రబాబు గొప్ప దోపిడీ ట్రైనర్‌!

21 May, 2018 19:02 IST|Sakshi

ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో తనవాళ్లకు బాగా ట్రైనింగ్‌ ఇచ్చాడు

ఆ ట్రైనింగ్‌ ప్రకారమే టీడీపీ ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు జనాన్ని దోచుకుంటున్నారు

సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించినందుకు ప్రతిగా.. ప్రజలను, సహజ వనరులను దోపిడీ చేస్తున్న ఘనుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. దోపిడీలకు పాల్పడటమేకాక.. టీడీపీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జన్మభూమి కమిటీలకూ ఎలా దోచుకోవాలో చంద్రబాబు ట్రైనింగ్‌ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇసుక నుంచి పోలవరం కాంట్రాక్టుల దాకా అన్నింటా దోపిడీల పర్వం కొనసాగుతున్నదని వివరించారు. 167వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం మార్కెట్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

తాడేపల్లిగూడేనికి ఏమిచ్చాడు?: ‘‘2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు టీడీపీకే అన్ని సీట్లూ ఇచ్చారు. మరి ఈ నాలుగేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు ఏమిచ్చారు? మరీ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏం చేశారు? తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు కడతామన్నారు.. కనీసం రోడ్డైనా వేయలేదు! నల్లజర్ల నుంచి తాడేపల్లి, తాడేపల్లి-భీమవరం, కైకలూరు-ఏలూరు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. నాలుగేళ్లలో ఇక్కడ ఒక్క కాలేజీ కూడా కట్టలేని ఆయన.. కేంద్రం ఇచ్చిన ఎన్‌ఐటీకి కనీసం కాంపౌండ్‌ వాల్‌ కూడా కట్టలేదు. వైఎస్సార్‌ హయాంలో మంజూరైన తాడేపల్లిగూడెం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పనులు పూర్తిచేయలేని అసమర్థుడు బాబు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నవైనం జిల్లా వాసులుగా మీకు తెలిసిందే. ప్రజలకు అవసరమైన పనులు చేయకపోగా, బాబు తన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్‌ ఇస్తాడు.. రౌడీయిజం, అధికారులపై దౌర్జన్యం, ఆడవాళ్లను జుట్టుపట్టి ఈడ్చడం, మట్టిని, ఇసుకను అక్రమంగా తొవ్వుకోవడం, కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి కమిషన్లు లాగడం లాంటివి ట్రైనింగ్‌ ఇస్తాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల కింద జన్మభూమి కమిటీలు ఆ ట్రైనింగ్‌ ప్రకారమే జనాన్ని దోచుకుతింటున్నారు.


ఇక్కడి టీడీపీ నేతలు పేకాట రాయుళ్ల దేవుడు: తాడేపల్లిగూడెం టీడీపీ నాయకుడు, జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు.. ఇసుక, మట్టి దోపిడీలే కాదు మరో కథనూ నడిపిస్తాడని జనం చెబుతున్నారు. భారీ ఎత్తున పేకాడేవాళ్లు ఈ ఎమ్మెల్యేకు నెలకు రూ.30 లక్షలు చెల్లించుకోవాలట! ఈ అక్రమ వ్యవహారాలన్నీ చూసి ఓ సీఐ చర్యలు తీసుకుంటే.. మరుసటిరోజే ఆయనను పక్కనపెట్టేశారు. ఇక్కడి కలెక్టర్‌.. టీచర్లను నడుస్తున్న శవాలంటూ దారుణంగా తిట్టాడు. ఆయనపై చర్యలులేవు. నాలుగేళ్లవుతున్నా ఆయనకు బదిలీ ఉండదు. తన పాలనలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరను కల్పించలేని చంద్రబాబు.. తన హెరిటేజ్‌ సంస్థ కోసం రైతుల పంటల్ని తక్కువ ధరకు కొని, నాలుగింతలు ఎక్కువ లాభాలు సొమ్ముచేసుకుంటున్నాడు.

అందుకే ప్రతి సోమవారం పోలవరానికి పరుగులు: ఈ మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు.. పోలవరం పనులు 50 శాతం పూర్తయ్యాయని! నిజమే, ఆ 50 శాతంలో 70 శాతం పనులు దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో జరిగినవే. అసలు రాష్ట్రానికి వరదాయిని అయిన పోలవరం గురించి పట్టించుకున్నది, పనులు ప్రారంభించింది వైఎస్సార్సే అన్న సంగతి అందరికీ తెలిసిందే. నాలుగేళ్లుగా పోలవరం పేరుతో జరుగుతోన్న దోపిడీ అంతాఇంతా కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరాన్ని తామే కడతామని కేంద్రం అంటే.. వద్దూ నేనే కడతానని బాబు ముందుకొచ్చాడు. కేవలం కమిషన్ల కోసమే ఆయన పోలవరం కడతానన్నాడు. ఆ వెంటనే రేట్లను విపరీతంగా పెంచుతూపోతుపోయాడు. తన బినామీనకు నామినేషన్‌ పద్ధతిలో సబ్‌ కాంట్రాక్టులు ఇప్పించాడు. 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరగాల్సిఉంటే.. ఈ నాలుగేళ్లలో కేవలం 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనే జరిగింది. ప్రతిసోమవారం చంద్రబాబు పోలవరానికి పోయేది పనులు ఎలా జరుగుతున్నాయో చూడటానికో, పనుల వేగం పెంచడానికోకాదు.. కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన కమిషన్ల వసూలుకే సోమవారం పోలవరానికి వెళతాడు

మోసగాళ్లను ఇంకా నమ్ముదామా?: గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు చేతిలో మోసపోనివారంటూలేరు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి, కాపులకు రిజర్వేషన్‌.. అంటూ వందలకొద్దీ హామీలిచ్చారు. వాటిలో ఏఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేశాడు. నాకు అలా చేయడంరాదు. చేయగలినిన పనైతే తప్పకుండా మాటిస్తా. కాకపోతే ప్రయత్నిస్తానని మాత్రమే అంటాను. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు ఇస్తున్న నిధుల కంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తామని మాటిస్తున్నా. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు అంటున్నాడు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా? ఇన్నాళ్లూ మోసం చేసిన చంద్రబాబును పొరపాటున కూడా క్షమిస్తే, కొత్త ఎత్తులతో జనం దగ్గరికొస్తాడు. ఇంటికి కేజీ బంగారం, బెంజికారు ఇస్తానంటాడు. అందుకే ఈ దుర్మార్గ వ్యవస్థలో మార్పులు రావాలి. చెప్పినమాట నిలబెట్టుకోలేనప్పుడు రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అది జగన్‌ ఒక్కడితోనే సాధ్యంకాదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే మన ప్రభుత్వంలో ప్రజలకు చేయబోయే మేళ్లను నవరత్నాల ద్వారా వివరించాం. ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి మరోసారి చెప్పుకుందాం..

ఆరోగ్యశ్రీలో మెరుగైన మార్పులు చేస్తాం: ఇవాళ వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ అక్కడ వర్తించదట! గుండె, మెదడుకు సంబంధించిన పెద్ద ఆపరేషన్లు చేయించాలంటే మంచి ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. పాత రేట్లు మార్చలేదు. దీంతో డాక్టర్లు ఆపరేషన్లు చేయడం లేదు. మనం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పు చేస్తాం. ఈ పథకం కింద ఏ పేదవాడికైనా వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాం. ఏ ఆపరేషన్‌కైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఉచితంగానే ఆపరేషన్‌ చేయిస్తాం. ఆ తర్వాత రోగి విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా డబ్బులు అందిస్తాం. దీర్ఘకాలంగా డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తాం. ఏడాది ఓపిక పట్టండి దేశంలో ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు