బాబు తమ మిత్రుడే అని రాజ్‌నాథ్‌ చెప్పలేదా?

24 Jul, 2018 14:15 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ సీపీ, బీజేపీకి సహకరిస్తోందని తప్పుడు ఆరోపణలు చేశారని.. పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు నాయుడు తమ మిత్రుడేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పలేదా అని వైఎస్సా‍ర్‌సీపీ అధికార ప్రతినిథి ప్రశ్నించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనను చంద్రబాబు ఖండించారా అని సూటిగా అడిగారు. కేంద్రంలో ఎన్డీయేపై పోరాటాన్ని ప్రకటించిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తాము పోరాడామని..ఇంకా పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. హోదాపై మాట్లాడిన ప్రతి ఒక్కరినీ పోలీసులతో అరెస్ట్‌ చేయించారని మండిపడ్డారు. అవిశ్వాసం వల్ల చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తమ సొంత ఎజెండాపైనే మాట్లాడారని విమర్శించారు.  అటు ప్రధాని, ఇటు రాహుల్‌ గాంధీ ఏపీ ప్రయోజనాలపై దాటవేసే ధోరణి చూపారని అన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసింది..ప్రధాని ప్రసంగం తర్వాత క్లారిఫికేషన్‌పై మాట్లాడే అవకాశాన్ని టీడీపీ ఎంపీలు వృధా చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఒప్పుకున్న తర్వాతే ప్యాకేజీ ప్రకటించామని ప్రధాని మోదీ చెప్పారు..దీనికి సమాధానం చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. అవిశ్వాసంపై చర్చ తర్వాత ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పాలి..ప్రధాని మాటలను ఎక్కడా ఖండించలేదు కాబట్టి..ప్యాకేజీకి తాను ఒప్పుకున్న విషయం వాస్తవమేనని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లు తెలుస్తోందన్నారు.

మరిన్ని వార్తలు