గోవాకు త్వరలో కొత్త సీఎం?

17 Sep, 2018 03:59 IST|Sakshi
మనోహర్‌ పారికర్‌

పణజి: ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్‌ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్‌ సంతోష్, రామ్‌ లాల్, రాష్ట్ర ఇన్‌చార్జి విజయ్‌ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌ టెండూల్కర్‌ తెలిపారు.

40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్‌సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్‌ కార్యదర్శి చెల్లకుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు