ప్రణయ్‌ ప్రతిరూపంగా పెంచుకుంటా! | Sakshi
Sakshi News home page

వారిని దారుణంగా చంపాలి 

Published Mon, Sep 17 2018 3:55 AM

Amrita emotional at pranay dead body - Sakshi

మిర్యాలగూడ: ‘ప్రణయ్‌ హత్యలో ఎంత మంది ఉన్నారో, వారిని దారుణంగా చంపాలి. వాళ్లను ఉరి తీయొద్దు.. అతి దారుణంగా చంపితేనే అది చూసి ఎవరు ఇలాంటి హత్యలు చేయకుండా ఉంటారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా భావిస్తున్నా’అని అమృత పేర్కొంది. మిర్యాలగూడలో సంచలనం రేపిన పరువు హత్యకు సంబంధించి ప్రణయ్‌ భార్య అమృత సంచలన విషయాలు వెల్లడించింది. కొందరు నాయకుల పేర్లను బయటపెట్టింది. ఆదివారం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆమె ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ‘ప్రాణాలు తీస్తారని ప్రణయ్‌ భయపడేవాడు కాదు. నాకు నిత్యం తోడుగా ఉంటూ చాలా ధైర్యం చెప్పేవాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రణయ్‌ అంటే నాకు ఎంత ఇష్టమో అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. నేను వారి వద్దనే ఉంటా. నాకు పుట్టే బిడ్డను ప్రణయ్‌కి ప్రతిరూపంగా పెంచుకుంటా’ అని చెప్పింది. పరువు, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదని, వారిని ఎవరూ క్షమించరని, శిక్ష కఠినంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొంది.
 
పలువురి పేర్లు వెల్లడి... 
ప్రణయ్‌ హత్యలో తన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్, టీఆర్‌ఎస్‌ నేత, న్యాయ వాది భరత్‌కుమార్, నకిరేకల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కరీం, వ్యాపారవేత్తలు రంగా శ్రీకర్, రంగా రంజిత్‌ ఉన్నట్లు అమృత వెల్లడించింది. ‘వివాహం చేసుకున్న తర్వాత వీరేశం నన్ను, ప్రణయ్‌ని పిలిపిస్తే వెళ్లలేదు. అంతకుముందు రోజు నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య విషయాన్ని పత్రికల్లో చూసి వెళ్లలేదు. అందుకే కేతేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ప్రణయ్‌ తండ్రి బాలస్వామిపై ఎల్‌ఐసీ డబ్బులు కట్టలేదని కేసు పెట్టించారు. ఆయన ఎల్‌ఐసీ ఏజెంట్‌ కాకపోవడంతో మేము ఐజీ వద్దకు వెళ్లాం. ఆ తర్వాత ఎస్పీని కలసి పూర్తి వివరాలు చెప్పాం’ అని గతంలో జరిగిన విషయాలను తెలియజేసింది.  

బయట తిరిగితే ప్రజలే చంపుతారు
ప్రణయ్‌ తమ్ముడు అజయ్‌  
‘నా అన్న ప్రణయ్‌ని చంపిన మారుతీరావు బయట తిరిగితే ప్రజలే చంపుతారు. ప్రణయ్‌ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తున్నాడు. ఇటీవల అమృతతో ఆమె తల్లి ఫోన్‌లో మాట్లాడేది. అలా నమ్మించి ప్రణయ్‌ని చంపారు. హత్యకు ముందురోజు వినాయచవితి నాడు నాతో ప్రణయ్‌ ఫోన్‌లో మాట్లాడాడు. ఇలా జరుగుతుందనుకోలేదు. అన్న, వదినలు అన్యోన్యంగా ఉండేవారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశాడు.

నన్నూ చంపుతారు: ప్రణయ్‌ తండ్రి బాలస్వామి
‘నా కొడుకు ప్రణయ్‌ని చంపి తన కూతురిని తీసుకెళ్లాలనుకున్నాడు. అమృత అతని వద్దకు వెళ్లనంటోంది. మా వద్దనే ఉన్నా మంచిగా చూసుకుంటాం. కానీ ఆమెను తీసుకెళ్లడానికి నన్ను కూడా చంపుతాడు. మారుతీరావు, శ్రవణ్‌కుమార్‌లను శాశ్వతంగా మిర్యాలగూడ నుంచి బహిష్కరించాలి. నా కొడుకు అమృతను ప్రేమించిన నాటి నుంచే ఎన్నో సార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రణయ్‌ కళాశాలకు వెళ్లకుండానే పరీక్షలు రాశాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా వారిద్దరు మంచిగా ఉండేవారు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడుతున్నారని చెప్పేవాడు. వారి కోపం తగ్గిందని భావించాం. కానీ నమ్మించి ఇలా చంపుతాడనుకోలేదు’ అని కన్నీటి పర్యంతమయ్యాడు.

Advertisement
Advertisement