తమ్ముళ్లపై సీఎం సీరియస్‌!

12 Jun, 2018 13:20 IST|Sakshi

తగవులు వద్దు..కలిసి పనిచేయండి

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

వ్యక్తిగతంగా భేటీ కొనసాగించిన అధినేత

సీఎం రమేష్‌–వరద వివాదాన్ని వివరించిన సోమిరెడ్డి

సాక్షి ప్రతినిధి, కడప:  జిల్లా ప్రాజెక్టులకు సాగునీరు ఇచ్చాం. వ్యక్తిగతంగా నాయకులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాం. కార్యకర్తలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాం. టీడీపీ దూసుకుపోవాల్సినసమయంలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీని బజారుపాలు చేస్తున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే నేనేమి చేయాలో నాకు తెలుసు. స్పర్థలు మానుకొని, పార్టీ ఉన్నతి కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై సీరియస్‌ అయ్యారు.

టీడీపీ నేతలు వరుసగా పత్రికలకెక్కుతుండడం, పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సోమవారం రాజధాని అమరావతిలో సీఎం టీడీపీ ఇన్‌చార్జిలతో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేశారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి మధ్య నెలకొన్న వివాదాన్ని మంత్రి సోమిరెడ్డి సీఎంకు వివరించినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడి అభిప్రాయం తర్వాత, నిఘా వర్గాల నివేదికలు అందుబాటులో ఉంచుకొని వ్యక్తిగత భేటికి సీఎం సిద్ధమైనట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఒక్కక్కరుగా పార్టీలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

‘ఆది’ నియంతృత్వాన్ని కంట్రోల్‌ చేయండి...
 మంత్రి ఆదినారాయణరెడ్డి ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నారు. మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేసిన కార్యకర్తలపై మంత్రి అనుచరులు దాడి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు. జిల్లాలో మంత్రి ఏకపక్ష చర్యలు తీవ్రతరమయ్యాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మీవద్ద నక్క వినయం ప్రదర్శిస్తూ జిల్లాలో మంత్రి చెలరేగిపోతున్నారని, చాలా తెలివిగా టీడీపీ నాయకులకు పొగపెట్టుతున్నారని.. సీరియస్‌గా పరిగణించకపోతే పార్టీ మా మనుగడ కష్టమేనని వివరించినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలకు సత్తా లేక మౌనంగా కూర్చోలేదని, మీకు పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే కారణంగా భరిస్తున్నామని వెల్లడించినట్లు తెలిసింది. అవకాశవాద రాజకీయాలు చేయడంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం తెలివిగా ప్రదర్శిస్తోంది. పార్టీలో మంత్రి యాక్టివ్‌గా ఉన్న ఆయన కుటుంబం పక్క చూపులు చూస్తోంది. గత ఆరు నెలలుగా మంత్రి సోదరులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని పీఆర్‌ ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.

ధోరణి మార్చుకోండి....
 ఇన్‌చార్జిలు పార్టీలో అందర్నీ కలుపుకొని వెళ్లాలి, ఏకపక్ష చర్యలు వీడాలి, పార్టీ నష్టం కల్గించే ఎలాంటి చర్యలైన ఉపేక్షించే పరిస్థితి లేదని, మీ ధోరణి మారాలని ప్రొద్దుటూరు, బద్వేల్‌ ఇన్‌చార్జిలు వరదరాజులరెడ్డి , విజయమ్మలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడుగా ఎంపికైన సీఎం రమేష్‌ను ఉద్దేశించి మండలానికి తక్కువ నాయకుడు అంటారా...అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో టెండర్‌ వర్క్‌లో కూడా ఎంపీ ఏకపక్షంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, తాము గౌరవంగా ఉండాలన్నా సీఎం రమేష్‌ ఉండనీయడం లేదని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్, లింగారెడ్డి ఇద్దర కలిసి శల్యరాజకీయం చేస్తున్నారని వాపోయినట్లు తెలుస్తోంది.

ఏమైనా ఉంటే సమన్వయ కమీటీ సమావేశంలో చర్చించండి, ఇన్‌చార్జి మంత్రి ద్వారా పరిష్కరించు కోవాలని అలా కాకుండా మీడియాకు ఎక్కితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలను సైతం సీఎం మందలించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్యయం నెలకొల్పాల్సింది పోయి, మీరు మరింత ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డట్లు తెలుస్తోంది. ఇకపై పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, పార్టీ పరువు తీసే చర్యలు చేపట్టితే ఎలాంటి వారినైనా ఉపేక్షించరాదని మీ పరిధిలోనే ఆ దిశగా అడుగులు వేయాలని వివరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో అన్నీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు