మంత్రుల గోబెల్స్‌ ప్రచారం..

12 Jun, 2018 13:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే గోబెల్స్‌ ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని.. బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిని నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని అన్నారు. బీసీలకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం లేకుండా చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌దేనని కృష్ణమూర్తి గుర్తుచేశారు.

బీసీ డిక్లరేషన్‌ ఏమైందంటూ ప్రశ్నించిన ఆయన దీనిపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీ బడ్జెట్‌ నిధులు, సబ్‌ ప్లాన్‌కి చట్టబద్ధత, బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్‌ పోస్టులు ఎక్కడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంలోని నామినేటెడ్‌ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే ఎందుకు నోరు మోదపడం లేదంటూ కాల్వ, యనమల తీరుపై విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్‌ పదవి యనమల వియ్యంకుడుకి ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ హయంలో బీసీలకు  ఏం చేశారో చెప్పలేని మీరు.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు