‘ఏపీ అభివృద్దికి సంపూర్ణ సహాయ సహకారాలు’

12 Feb, 2020 21:41 IST|Sakshi

సీఎం జగన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు: ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం సానుకూలంగా జరిగిందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అన్ని అంశాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరించారన్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్దికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు మిథున్‌ రెడ్డి తెలిపారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదని ఇప్పటికే పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రధానికి సీఎం వివరించారన్నారు. 

శాసనమండలి రద్దుకు సంబంధించి రాజ్యాంగ ప్రక్రియ జరుగుతుందని, ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. శాసనమండలి ప్రతీ అభివృద్ది కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని, అందువల్ల శాసనమండలిని రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు నెరవేర్చాలని సీఎం జగన్‌ ప్రధానిని కోరారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ చెప్పిన అంశాలను నిశితంగా విన్న ప్రధాని రాష్ట్ర అభివృద్దికి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు ఎంపీ మిథున్‌ రెడ్డి తెలిపారు. 

చదవండి:
ప్రధాని మోదీకి సీఎం జగన్‌ ఆహ్వానం
రేణుదేశాయ్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు

మరిన్ని వార్తలు