వచ్చే ఏడాదిలోగా సంపూర్ణ అక్షరాస్యత

15 Jan, 2018 12:20 IST|Sakshi

విభజన చట్టం హామీల్లో భాగంగా ఇప్పటికే ఐదు యూనివర్శిటీల రాక

ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు

ఐఐఐటీ విషయంపై రెండు రోజుల్లో స్పష్టత

మీడియాతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు

ఒంగోలు: 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయన తొలుత ఏడుగుండ్లపాడు వద్ద ఉన్న నిమ్రా కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆ కళాశాల ఐఐఐటీ తరగతులకు అనువుగా ఉంటుందా..లేదా అనే దానిపై ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.వెంకట బసవరావు, గుంటూరు ఆర్‌జేడీ శ్రీనివాసరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావుతో కలిసి పరిశీలించారు. స్థలం 14 ఎకరాలు ఉందని, దక్షిణం వైపు 20 ఎకరాలు, తూర్పు దిక్కున మరో 10 ఎకరాలు కూడా లీజుకు తీసుకుంటామంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాలేజీ యాజమాన్యం మంత్రి గంటా శ్రీనివాసరావుతో చెప్పింది. అనంతరం స్థలం డిజైన్‌లను స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన ఏడు వర్శిటీల్లో ఐదు వచ్చేశాయని చెప్పారు. సెంట్రల్‌ యూనివర్శిటీ, ట్రైబల్‌ యూనివర్శిటీలు వచ్చే విద్యా సంవత్సరంలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రికల్చరల్, పెట్రోలియం, మైనింగ్, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన 17 సంస్థలకు 3468 ఎకరాల స్థలం అవసరమని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాగానే నిర్మాణాలు వేగవంతం చేస్తామని మంత్రి వివరించారు.

ఏపీపీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ
బడికొస్తా పథకాన్ని గతేఏడాది 9వ తరగతి బాలికలకు మాత్రమే అమలు చేశామని, ఈ ఏడాది 8వ తరగతి బాలికలకు కూడా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా తెలిపారు. యూనివర్శిటీల్లోని కొన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, అదే విధంగా తాజా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల జాప్యం జరుగుతోందన్నారు. దాన్ని కూడా త్వరలోనే విడుదల చేసి ఏపీపీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. ఇప్పటికే ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి 2250 మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నారని, ఆగస్టులో మరో వెయ్యి మంది జాయినవుతారన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నిర్వహణ కష్టమని ఇప్పటికే వైస్‌ చాన్స్‌లర్‌ సూచించడంతో ప్రస్తుతం తరగతులను జిల్లాలోని తాత్కాలిక తరగతి గదుల్లో నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకోసం నిమ్రాతో పాటు మరో రెండు స్థలాలను కూడా పరిశీలిస్తున్నామని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిలా మంత్రి శిద్దా రాఘవరావులు రెండు రోజుల్లో తాత్కాలిక భవనాలు, పర్మినెంట్‌గా ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఖరారు చేస్తారని చెప్పారు.

స్థలం ఖరారైన రెండు నెలల్లోనే నిర్మాణాలు రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ నెల 22న అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.369 కోట్లు కేటాయించామని, అందులో కందుకూరు నియోజకవర్గానికి రూ.22 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. 24న యూనివర్శిటీ వైస్‌చాన్స్‌లర్‌ల సమీక్ష సమావేశం విశాఖలో గవర్నర్‌ అధ్యక్షతన జరుగుతుందని, ఆ తర్వాత వేగవంతమైన మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనుమతి లేని పాఠశాలలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వందశాతం అమలు అవుతుందని చెప్పలేమని, యాజమాన్యాలు కూడా తమ వైఖరిని మార్చుకున్నాయన్నారు. పనిలో పనిగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి గంటా విరుచుకుపడ్డారు.  

మరిన్ని వార్తలు