హృదయాన్ని తాకేది... పాటే..!

11 Sep, 2023 00:31 IST|Sakshi

వాగ్గేయకార వైభవం

శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు.

కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది.

ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్‌ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే.

గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు.

నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం.

అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 

మరిన్ని వార్తలు