భర్తగా నా ధర్మాన్ని నెరవేర్చాను!

4 May, 2019 14:17 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భార్య పూనమ్‌ సిన్హా తరఫున తాను ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శ్రతుఘ్న సిన్హా సమర్థించుకున్నారు. తమ పార్టీలు వేరైనా.. ఆమె తన భార్య అయినందున పతిధర్మాన్ని నెరవేరుస్తున్నానని, భార్య తరఫున ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘లక్నోలో ప్రచారం చేయడం ద్వారా నేను పతిధర్మాన్ని నెరవేర్చాను. పట్నాలో ప్రచారం చేపట్టడం ద్వారా పూనమ్‌ కూడా తన పత్ని ధర్మాన్ని నెరవేరబోతుంది’ అని షాట్‌గన్‌ తనదైన శైలిలో చెప్పారు.

బీజేపీ రెబెల్‌గా ప్రధాని మోదీ, అమిత్‌షాలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శ్రతుఘ్న ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పట్నా నుంచి కాంగ్రెస్‌ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌ నాయకుడై ఉండి.. లక్నోలో ఎస్పీ తరఫున ప్రచారం చేయడం ద్వారా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని లక్నో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆచార్య ప్రమోద్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై శత్రుఘ్న స్పందిస్తూ.. ‘ఈ వివాదం ఎందుకు చెలరేగుతుందో నాకు అర్థం కావడం లేదు. గత నెలలో కాంగ్రెస్‌ పార్టీలో చేరే సమయంలోనే నేను నా భార్య తరఫున ప్రచారం చేస్తానని పార్టీ అధినాయకత్వానికి చెప్పాను. అధిష్టానం కూడా ఒప్పుకుంది. లక్నోలో మే 6న పోలింగ్‌ ముగిసిన తర్వాత పూనం పట్నాలో ప్రచారం నిర్వహించనున్నారని ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చాం. ఆ పార్టీ కూడా అభ్యంతరం చెప్పలేదు. నా వరకు కుటుంబానికే మొదటి ప్రాధాన్యం’ అని షాట్‌ గన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు