మోదీ హెలికాప్టర్‌లో ఏముంది?

18 Apr, 2019 14:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారిని సస్పెండ్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు అధికారిక ట్విటర్‌ పేజీలో స్పందించింది. ‘తన విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ప్రధాని వాహనంతో సహా ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకుల వాహనాలను తనిఖీ చేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి. తన హెలికాప్టర్‌లో మోదీ ఏం తరలించారు. దాన్ని దేశ ప్రజలు చూడకూదని ఆయన కోరుకుంటున్నారా?’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

1996 బ్యాచ్‌కు చెందిన మహ్మద్‌ మోసిన్‌ అనే ఐఏఎస్‌ అధికారిని మంగళవారం ఈసీఐ సస్పెండ్‌ చేసింది. ఏప్రిల్‌ 10న, మార్చి 22న నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని ఈసీఐ తెలిపింది. ఒడిశాలోని సబల్పూర్‌ ఎన్నికల సభ సందర్భంగా నరేంద్ర మోదీ హెలికాప్టర్‌లో మహ్మద్‌ మొసిన్‌ సోదాలు జరిపారు. అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడంతో ప్రధాని మోదీ 15 నిమిషాలు వేచిచూడాల్సి వచ్చింది. అయితే ఎస్పీజీ భద్రత ఉన్న ప్రధాని హెలికాప్టర్‌కు తనిఖీల నుంచి మినహాయింపు ఉందని ఈసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఒడిశా ముఖ్యంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ హెలికాప్టర్లలోనూ ఈసీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు