పట్టువిడుపులొద్దు.. గెలిచేవి వదలొద్దు

5 Oct, 2018 01:11 IST|Sakshi

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీలో పార్టీ నేతల నిర్ణయం

మహాకూటమి పార్టీలకు 20 స్థానాలే ఇవ్వాలని యోచన

ఇందులో టీడీపీ–12, సీపీఐ 3–4, టీజేఎస్‌కు 3–4 స్థానాలు..

నేడు 40 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితా?

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి రూపుదిద్దుకోవడం కోసం పట్టువిడుపులు ప్రదర్శించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ అభిప్రాయపడింది. గెలిచే సీట్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని నిర్ణయించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ కోర్‌ కమిటీ సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోర్‌కమిటీ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల ప్రచారంతో పాటు మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా చర్చించారు. కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కోరుతున్న స్థానాల సంఖ్య, ఏయే స్థానాలు కోరుతున్నారన్న దానిపై కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది. మొత్తం 40–45 స్థానాల్లో పోటీచేస్తామని కూటమిలోని మూడు పార్టీలు కోరుతున్నప్పటికీ.. మొత్తం కలిపి 20 స్థానాలే ఇవ్వాలని నిర్ణయించారు.

అంతకంటే ఎక్కువ ఇవ్వడం వల్ల గెలిచే సీట్లను కూడా వదులుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇందులో తెలుగుదేశం–12, సీపీఐకి 3 నుంచి 4, టీజేఎస్‌కు 3 నుంచి 4 స్థానాలతో సరిపెట్టాలని.. అవసరమైతే అదనంగా ఒకటి, రెండు సీట్లలో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించారు.

బలమున్న చోట అడుగుదాం..
సంఖ్య విషయంలో రాజీపడకుండా ఉండాలంటే తాము బలంగా ఉన్న చోట్ల కూడా కూటమి పార్టీలు అడుగుతున్న స్థానాలపై పట్టుపట్టాల్సిందేనని కోర్‌ కమిటీ సమావేశంలో   కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా ఖమ్మం, వైరా, నకిరేకల్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మంచిర్యాల, చెన్నూరు, ముదోల్, నకిరేకల్, తుంగతుర్తి, వరంగల్‌ ఈస్ట్, వెస్ట్, మహబూబ్‌నగర్, ఎల్బీనగర్‌ లాంటి స్థానాల్లో కచ్చితంగా కాంగ్రెస్‌ గెలిచే అవకాశమున్నందున వాటిని ఇచ్చేది లేదని.. ఈ స్థానాల్లో పోటీ విషయంలో తమకున్న విజయా వకాశాలను కూటమి పార్టీల ముందుపెట్టాలని భావిస్తున్నారు.

నేడు లేదా 10 తర్వాతే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా శుక్రవారం వెలువడే అవకాశముందని గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎక్కడా ఇబ్బందులు లేని స్పష్టమైన స్థానాల గుర్తింపు పూర్తయిందని, 40 మందితో తొలి జాబితా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శుక్రవారం జాబితా ప్రకటించని పక్షంలో ఈ నెల 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మరిన్ని వార్తలు