అదితికి కాంగ్రెస్‌ షోకాజ్‌​ నోటీసు

4 Oct, 2019 19:46 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌కు ఆ పార్టీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశాలను ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు బహిష్కరించాయి. కానీ అదితి మాత్రం బుధవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేసి.. దానిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. 

దీనిపై యూపీ సీఎల్పీ నాయకుడు అజయ్‌ కుమార్‌ లల్లు మాట్లాడుతూ.. ‘పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అదితికి నోటీసులు జారీ చేశాం. రెండు రోజుల్లో దానిపై వివరణ ఇవ్వాలని కోరాం. అలాగే ఆమెపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో వివరణ అడిగామ’ని తెలిపారు. కాగా, రాయ్‌బరేలీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అదితి.. ఆర్టికల్‌-370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. అలాగే గాంధీ జయంతి రోజున కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నోలో చేపట్టిన శాంతి ర్యాలీకి కూడా అదితి హాజరుకాలేదు. అయితే కొంత కాలం నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న అదితి.. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

చదవండి : ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే!

మరిన్ని వార్తలు