హార్దిక్‌ పటేల్‌ చెంప చెళ్లు!

19 Apr, 2019 12:02 IST|Sakshi

అహ్మద్‌బాద్‌ : కాంగ్రెస్‌నేత, పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేందర్‌ నగర్‌ జిల్లా నిర్వహించిన జన ఆక్రోష్‌ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతుండగా... ఓ వ్యక్తి ఆయన చెంపపై కొట్టారు. ఊహించని ఘటనతో హార్దిక్‌ అవాక్కవ్వగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. నిన్న(గురువారం) బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై బూటు దాడి జరిగిన మరుసటి రోజే హార్దిక్‌పై మరో అంగతకుడు చేయిచేసుకోవడం గమనార్హం. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఆయనపైకి రెండు బూట్లు విసిరాడు. మొదటి బూటు జీవీఎల్‌కు దూరంగా వెళ్లగా.. రెండోది ఆయనకు అతి సమీపం నుంచి వెళ్లింది.

ఇక మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్‌.. జామ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. కానీ 2015లో పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్‌ ప్రోద్బలం ఉందంటూ మెహ్‌సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హార్దిక్‌ ఆశలు అడియాశలయ్యాయి. అయినా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు