‘హరీశ్‌ పాపం.. కేసీఆర్‌కు శాపం’

13 Feb, 2019 14:24 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. కేటాయింపులు లేకున్నా మంజీర నీటిని శ్రీరాంసాగర్‌కు అక్రమంగా తరలించారని ఆరోపించారు. హరీశ్‌ చేసిన పాపానికి ప్రస్తుతం మంజీర నది ఎండిపోయిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌ రావు అర్థరాత్రి మంజీరా నీళ్లను దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని విమర్శించారు. ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న హరీశ్‌.. సీఎం కేసీఆర్‌కు తెలియకుండానే నీళ్లను తరలించారని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుడనే కారణంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్‌కు తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదన్నారు. మంజీరను ఎండబెట్టి.. మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్‌ కోరికకు హరీశ్‌రావు తూట్లు పొడిచారని విమర్శించారు. హరీశ్‌రావు చేసిన పాపం మెదక్‌ జిల్లా ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు శాపంగా మారిందన్నారు. గెలిస్తే ప్రశ్నిస్తాననే భయంతో నాడు తనను హరీశ్‌ జైల్లో పెట్టించారని ఆరోపించారు. హరీశ్‌రావు చేసిన తప్పుకు సంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  నీటి అవసరం కోసం సంగారెడ్డికి రూ.10 కోట్లు తక్షణమే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు