కరువు, కర్ఫ్యూ  కాంగ్రెస్‌ కవలలు

15 Nov, 2023 04:59 IST|Sakshi
తెలంగాణ భవన్‌లో జరిగిన కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న హరీశ్‌

కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ‘కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌ పార్టీకి పుట్టిన కవలలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పాలనలో పవర్‌ హాలిడేలు, పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసే స్థితి నుంచి ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చే స్థాయికి చేరుకున్నామని అన్నారు.

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దేశమంతా కొట్టుకుని తెలంగాణలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ శక్తిని తట్టుకోలేక ఈ రెండు పార్టీలూ ఒక్కటవుతున్నాయని, తెలంగాణలో ఇటీవలి కాలంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘మునుగోడు, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోతే బీజేపీ గెలిచింది.

కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట బీజేపీ మద్దతు, బీజేపీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌ మద్దతు ఇస్తోంది. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. బీజేపీలో ఉన్న వివేక్, రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో కొట్లాడే ఈ పార్టీలు తెలంగాణలో మాత్రం కలుస్తాయి’అని హరీశ్‌ విమర్శించారు. ‘రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ తదితర సంస్థలను అమ్ముతూ బీజేపీ కార్మికుల ఉసురు పోసుకుంటోంది.

సంగారెడ్డి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సహా అనేక కర్మాగారాలను అమ్మే ప్రయత్నం చేస్తోంది’ అని హరీశ్‌ పేర్కొన్నారు. ‘అధికారంలోకి వచ్చి న వెంటనే ఆటో కార్మికులకు, రవాణా కార్మికుల కోసం ట్రాన్స్‌పోర్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తాం. రిసోర్స్‌ పర్సన్లు, వీఏవోల వేతనం రెట్టింపు చేస్తాం. బీమా పథకం అమలుచేసి, కుటుంబ పెద్ద మరణించిన వారం రోజుల్లో రూ.5 లక్షల బీమా డబ్బులు బాధిత కుటుంబానికి అందేలా చూస్తాం. మాట తప్పే కాంగ్రెస్‌ కావాలో, హామీలు నెరవేర్చే కేసీఆర్‌ కావాలో కార్మికులు తేల్చుకోవాలి’ అని హరీశ్‌రావు అన్నారు. 

మరిన్ని వార్తలు