ప్రియాంక రాకతో ‘శక్తి’మంతం

1 Apr, 2019 06:34 IST|Sakshi

22 లక్షలు పెరిగిన యాప్‌ సభ్యులు

ప్రియాంకాగాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వల్ల దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇంకా తెలియదు కానీ కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రియాంక రంగ ప్రవేశం తర్వాత పార్టీకి చెందిన శక్తి యాప్‌లో సభ్యత్వం 22 శాతం పెరగడమే దీనికి కారణం. ప్రియాంక రాకతో పార్టీలో చేరే మహిళల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాక ముందు శక్తి యాప్‌లో 54 లక్షల మంది సభ్యులుండేవారు. ఆమె  వచ్చిన రెండు నెలల్లోనే ఈ సభ్యత్వం 66 లక్షలకు పెరిగింది. ఇది ప్రియాంక ప్రభావమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా ప్రియాంక చేరిక తర్వాత పార్టీలో మహిళల సభ్యత్వం 22 నుంచి 40 శాతానికి పెరిగిందని నేతలు  తెలిపారు.

నాయనమ్మలాగే ప్రియాంక కూడా మహిళలను ఆకట్టుకుంటుందనడానికి ఇదే ఉదాహరణని అంటున్నారు. ప్రియాంక ద్వారా దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి పునరుజ్జీవం కల్పించాలన్న రాహుల్‌ గాంధీ ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు సంబరపడుతున్నాయి. అట్టడుగు స్థాయి కార్యకర్తలకు కూడా విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడానికి, వివిధ అంశాలు, నిర్ణయాలపై వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి రాహుల్‌ గాంధీ శక్తి యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్టీలో చాలా నిర్ణయాలు శక్తియాప్‌లో కార్యకర్తల అభిప్రాయాల మేరకే జరుగుతున్నాయి. ప్రియాంక కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ఈ యాప్‌నకు ఒక వాయిస్‌ మెసేజ్‌ పంపారు. ‘నేను ప్రియాంకా గాంధీని. కొత్త తరహా రాజకీయాల్లో మీ భాగస్వామ్యాన్ని నేను కాంక్షిస్తున్నాను. మనం నడపబోయే రాజకీయాల్లో ప్రజలందరి ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలు, మహిళల వాణి వినిపించాలి’ అని ఆ సందేశంలో ప్రియాంక పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు