బాబుకు అనుకూలమన్న భావనే మా కొంపముంచింది!

30 May, 2019 04:28 IST|Sakshi

సీపీఐ విశ్లేషణ

టీడీపీని విమర్శించడంలో వెనకపడ్డామన్న రామకృష్ణ

సాక్షి, అమరావతి: సీపీఐ, సీపీఎం, జనసేన, బీఎస్పీలు కలిసికట్టుగా పొత్తు పెట్టుకున్నా తాము సంఘటితం కాలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనికి తోడు టీడీపీ విధానాలను విమర్శించడంలో తాము వెనకబడడం వల్ల చంద్రబాబుకు తమ కూటమి అనుకూలమన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాము సాధించలేకపోయామని విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా గంపగుత్తగా వైఎస్సార్‌సీపీకి పడిందన్నారు. పార్టీ రాష్ట్ర నేతలు రావుల వెంకయ్య, హరినాథరెడ్డి, జల్లి విల్సన్‌తో కలిసి ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీని మట్టికరిపించడంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించారన్నారు.

రెండు రోజుల పాటు ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీపీఐ ఓటమికి దారితీసిన పరిస్థితులను సమీక్షించినట్టు తెలిపారు. పుల్వామా దాడి, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తర్వాత దేశంలో పరిస్థితి మారిపోయిందని, ఈ రెండు సంఘటనలను బీజేపీ బాగా ఉపయోగించుకోగలిగిందని, జాతీయవాదం పేరిట జనాన్ని తమ వైపు తిప్పుకోవడంలో మోదీ, అమిత్‌ షా విజయం సాధించారని చెప్పారు.  కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని తమ పార్టీ అభిప్రాయపడిందని, ఇందులో భాగంగా త్వరలో విజయవాడలో అన్ని కమ్యూనిస్టు పార్టీల నేతలతో  సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు. కాగా, కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు రామకృష్ణ తెలిపారు. 

సీపీఎం నేత మధుకు ఆహ్వానం 
వైఎస్‌ జగన్‌ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును ఆహ్వానించారు. జగనే స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు