ఎన్నికల బాండ్స్‌పై సుప్రీంకోర్టుకు

3 Feb, 2018 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఎలక్టోరల్ బాండ్స్' విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఎం ప్రధాన‌ కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. 'ఆర్ధిక బిల్లు 2017'గా పేర్కొంటూ.. ఎలక్టోరల్ బాండ్స్ విధానానికి కేంద్రం తెరలేపిందని ఆయన విమర్శించారు.  ఇందుకోసం జనవరి 2, 2018న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. రాజకీయ పార్టీలకు విదేశీ కార్పొరేట్ కంపెనీలు అందిస్తున్న విరాళాలపై  ఈమేరకు సీపీఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో రాజకీయ అవినీతి పెరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని, కార్పొరేట్లను కాపాడేందుకు 'ఎలక్టోరల్ బాండ్స్' విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని సీపీఎం తన పిటీషన్‌లో పేర్కొంది. ఈ విషయమై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఎలక్టోరల్ బాండ్స్ పై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీపీఎం తన పిటిషన్‌లో పేర్కొంది.
కార్పొరేట్ కంపెనీలు అధికారంలోకి వచ్చే పార్టీలకు డబ్బిచ్చి.. తమ పనులు చేయించుకుంటాయని తెలిపింది. ఈ వ్యవహారంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాల కేటాయింపుపై జాతీయ స్థాయిలో ఓ విధానం ఉండాలని, కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు పారదర్శకతతో విరాళాలు ఇచ్చే విధానం ఉండాలని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్స్ విధానం ద్వారా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించింది.

విదేశీ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఎంత నిధులిస్తున్నాయో తెలియకుండా ఉండేలా చట్టం చేస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,19 (1ఏ) సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగేలా ఎలక్టోరల్ బాండ్స్  విధానం ఉందని పేర్కొంది. గతంలో మనీబిల్లుగా పార్లమెంటులో బీజేపీ తీసుకువస్తే రాజ్యసభలో ఐదు సవరణలు చేశామని, రాజ్యసభ సవరణలకు ఆమోదం తెలిపినప్పటికీ,  లోక్‌సభలో బీజేపీ తనకున్న మెజారిటీతో ఆ సవరణలను తిరస్కరించిందని తెలిపింది.  బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ కార్పొరేట్ల నుంచి వచ్చిన మొత్తం విరాళాలలో 89 శాతం నిధులు అధికార పార్టీకే వచ్చాయని,  2004-5 ఆర్ధిక సంవత్సరం నుంచే విదేశీ కంపెనీలు కాంగ్రెస్, బీజేపీలకు కోట్లరూపాయల విరాళాలు ఇస్తున్నాయని, అవినీతి విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ ఒకటేనని సీపీఎం నేత ఏచూరి విమర్శించారు.

మరిన్ని వార్తలు