చంద్రబాబుది  చౌకబారు రాజకీయం

7 Apr, 2019 02:44 IST|Sakshi

2009 ఎన్నికల్లో నువ్వు ఫిర్యాదు చేస్తే డీజీపీని మార్చలేదా?

ఇప్పుడు సీఎస్, డీజీపీలను మారిస్తే తప్పా?

కేంద్ర మాజీ మంత్రి, విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి

సాక్షి, విశాఖపట్నం: తప్పుచేయకపోతే.. అవినీతికి పాల్పడకపోతే జైలులో పెడతారని ఎందుకు భయపడుతున్నావో చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, విశాఖ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు నినాదం మీ భవిష్యత్‌–నా బాధ్యత కాదని, నా భవిష్యత్‌–మీ బాధ్యత అని వ్యాఖ్యానించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ ఇంటెలిజెన్స్‌ డీజీ, డీజీపీలతో పాటు చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా మార్చడంపై చంద్రబాబు చౌకబారు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 2009 ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఫిర్యాదు మేరకు అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌వీ యాదవ్‌ను ఈసీ విధుల నుంచి తప్పించిన సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు.

తన భర్త వెంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, తాను బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వైఎస్సార్‌సీపీ, బీజేపీ అపవిత్ర కలయిక అంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఎటువంటి కలయికో చెప్పాలన్నారు. ఏపీని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు కేంద్రం సహకారం లేకుండానే అభివృద్ధి జరిగిందని గుండెలపై చేయివేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ కే.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు