చంద్రబాబు సభలో దీపక్‌రెడ్డి కలకలం

11 Jan, 2018 16:31 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటనలో వివాదం నెలకొంది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న దీపక్‌రెడ్డి.. ముఖ్యమంత్రి సభకు హాజరుకావడం వివాదానికి దారి తీసింది. జన్మభూమి- మాఊరు ముగింపు సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ధర్మవరం వచ్చారు. తన మామ జేసీ దివాకర్‌రెడ్డితో కలిసి దీపక్‌రెడ్డి సభకు హాజరయ్యారు. టీడీపీ నుంచి సస్పెండ్‌ అయిన నాయకుడు సీఎం సభకు రావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డిని భూకబ్జా కేసుల్లో హైదరాబాద్‌ పోలీసులు గతేడాది జూన్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని అన్నివైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. పార్టీ పరువు కాపాడుకునేందుకు దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్‌ చేశారు. మళ్లీ ఆయనతో ఈరోజు సీఎం చంద్రబాబు సభా వేదిక పంచుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పలు కేసుల నమోదు
దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక‌్షన్‌ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక‌్షన్‌447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక‌్షన్‌ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక‌్షన్‌ 148 కింద మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో బెదిరింపుల కేసు, సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు కూడా ఆయనపై ఉన్నాయి.

మరిన్ని వార్తలు