ఆ అభ్యర్థికి 204 కోట్ల ఆస్తి

24 Apr, 2019 19:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడవ విడత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 1,612 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో 21 శాతం అంటే, 340 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 230 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వారిలో తమకు శిక్ష పడిన కారణంగా ఎన్నికల్లో ఆరేళ్లపాటు పోటీ చేయకుండా దూరంగా ఉన్నామని 14 మంది తెలిపారు. మొత్తం అభ్యర్థుల్లో అందుబాటులోకి వచ్చిన 1,594 మంది అఫిడవిట్లను ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌’ అధ్యయనం చేయగా కోటి, అంతకన్నా ఎక్కువ ఆస్తులు కలిగిన వారు 392 మంది ఉన్నారు.  సమాజ్‌ వాది పార్టీ నుంచి 90 శాతం మంది, బీజేపీ నుంచి 84 శాతం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 82 శాతం కోటీశ్వరులు ఉన్నారు. వారిలో డిగ్రీ, అంతకన్నా ఎక్కువ చదివిన వారు 43 శాతం ఉండగా, ఏదో అక్షరాస్యులమని చెప్పుకున్నవారు 3.6 శాతం, నిరక్షరాస్యులమని చెప్పుకున్న వారు 1.4 శాతం మంది ఉన్నారు. 

ముడవ విడత ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల్లో కోటీ రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని ప్రకటించిన ప్రధాన పార్టీల్లో  బీజేపీ నుంచి 81మంది, కాంగ్రెస్‌ పార్టీ తరఫున 74 మంది, ఎస్పీ నుంచి పది, సీపీఎం నుంచి పది, ఎన్సీపీ నుంచి పది, బీఎస్పీ నుంచి తొమ్మిది, శివసేన నుంచి ఏడుగురు ఉన్నారు. కోటీశ్వరుల్లో గుజరాత్‌ నుంచి 75 మంది, మహారాష్ట్ర నుంచి 71 మంది, కర్ణాటక నుంచి కోటి మంది ఉన్నారు. 

ఎస్పీ నుంచి అత్యధిక ధనికుడు
పోటీ చేస్తున్న కోటీశ్వరుల్లో 150 కోట్ల నుంచి రెండువందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నావారు ముగ్గురు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి దేవేంద్ర సింగ్‌ యాదవ్‌కు 204 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతార నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా ఎన్‌సీపీ అభ్యర్థి ఉదయన్‌ రాజే భోసాలేకు 199 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లోని బైరెల్లి నుంచి పోటీ చేస్తున్న ప్రవీణ్‌ సింగ్‌ అరాన్‌కు 150 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో యువత కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం అభ్యర్థుల్లో 25 నుంచి 40 ఏళ్య మధ్యనున్న యువత 35 శాతం అంటే 562 మంది ఉన్నారు. అలాగే మహిళా అభ్యర్థులు 9 శాతం అంటే, 143 మంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు