అప్పుడు మీరు తీసుకున్నారా పర్మిషన్‌ ?

3 Nov, 2017 02:56 IST|Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన

జగన్‌ పాదయాత్రను అడ్డుకునేందుకే తప్పుడు సంకేతాలు

పాదయాత్ర చేస్తే నేరాలు జరుగుతాయా?

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు చెప్పడం సంకల్పయాత్ర ఉద్దేశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పాదయాత్ర చేసిన చంద్రబాబు ముందస్తు అనుమతి తీసుకున్నారా? అని నిలదీశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రకు అనుమతి తీసుకోవాలనడం అర్థరహితమన్నారు. పాదయాత్ర చేయడం కొత్త విషయమేమీ కాదని, స్వాతంత్య్రానికి పూర్వమే గాంధీ, వినోబాబావే, స్వాతంత్య్రం తర్వాత మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ ఎవరి అనుమతి లేకుండానే పాదయాత్ర చేశారని ధర్మాన గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల బాధలు తెలుసుకున్నారని, ఆ తర్వాత ఆయన కుమార్తె షర్మిల ఇదే బాటలో పయనించారని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రను నేర చర్యగా చిత్రీకరించేందుకు సర్కార్‌ ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మితిమీరిన వ్యవహారంగా ధర్మాన అభిప్రాయపడ్డారు. చట్టసభలో ప్రజల వాణిని విన్పించే అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం వల్లే విపక్ష నేత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి వస్తోందన్నారు. అధికార పార్టీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పడమే సంకల్పయాత్ర ప్రధాన ఉద్దేశమని ధర్మాన తెలిపారు. దగాపడుతున్న అన్ని వర్గాల బాధలను ఆలకించేందుకే జగన్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.   

పారిశ్రామికాభివృద్ధిపై గొప్పలే..!
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దారుణంగా ఉందని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రాష్ట్రాల్లో ఏపీకి 15వ స్థానం రావడం సిగ్గుచేటన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, చంద్రబాబు మాత్రం దేశంలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కీలక నిర్ణయాలపై ఏనాడూ ప్రతిపక్షంతో ప్రభుత్వం చర్చించలేదన్నారు. శాసనçసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్‌ మైక్‌ ఇవ్వరని, ప్రతిపక్షం మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలిసిపోతాయోనని తెలుగుదేశం సర్కార్‌ నిరంతరం భయంతో బతుకుతోందన్నారు. గడచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం రహస్యంగా 2 వేల జీవోలను విడుదల చేసిందని, ఆ రహస్య జీవోలు ఎందుకు విడుదల చేశారో చెప్పగలరా? అని నిలదీశారు. ప్రజా సంకల్ప యాత్ర సజావుగా సాగాలని ఈ నెల 3న వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారని చెప్పారు. 6వ తేదీ ఉదయాన్నే ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.


ప్రజా సమస్యలు ఎన్నో..
కొత్త రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదని ధర్మాన అన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుదలతో పాటు ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులు మూడు సార్లు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు.ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలోనే ఇంధన ధరలు పెరిగాయన్నారు. రేషన్‌ సరుకుల్లోని ఏడింటిలో ఆరింటికి కోత పెట్టిందని, కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లవుతున్నా రాజధాని నిర్మాణం జరగలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదని, కనీసం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని ధర్మాన దుయ్యబట్టారు. రాష్ట్ర అప్పు ప్రస్తుతం రూ.2.15 లక్షల కోట్లకు చేరిందని, కేవలం ఈ మూడేళ్లల్లోనే రూ.1.18 లక్షల కోట్లు అప్పుచేశారని ధర్మాన తెలిపారు.

మరిన్ని వార్తలు