జాకెట్‌’ యాడ్‌.. పొలిటికల్‌ ట్రెండ్‌

22 Mar, 2019 11:23 IST|Sakshi

రాజకీయ పార్టీలు అవకాశం ఉన్నంత వరకు ప్రతీదాన్నీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఇళ్లు, గోడలు, వాహనాలనే కాక మనం ధరించే డ్రస్సులను కూడా వాడుకుంటున్నాయి. ఇప్పటికే  ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేతలు ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ ఫొటోలను చీరలు, టీషర్టులపై ముద్రించి మార్కెట్‌లోకి వదిలారు. తాజాగా మగవాళ్లు ధరించే జాకెట్లపై కూడా మోదీ, రాహుల్‌ ఫొటోలు ముద్రించి అమ్ముతున్నారు. ఆయా పార్టీల, నేతల అభిమానులు వాటిని ధరించడం గర్వంగా భావిస్తున్నారు.

‘ప్రధాని మోదీ మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశారు. ఆయనకు మద్దతుగానే ఈ జాకెట్లు ధరిస్తున్నాం’ అన్నాడు మోదీ ఫొటో ఉన్న జాకెట్‌ వేసుకున్న సరళ్‌జైన్‌ అనే యువకుడు. రాహుల్‌ గాంధీ జాకెట్‌ తొడుక్కున్న శరద్‌చంద్ర అయితే, ‘దేశ యువతకు ప్రతీక రాహుల్‌గాంధీ. ఆ యువతలో నేనూ భాగమే కాబట్టి ఆయన ఫొటో ఉన్న ఈ జాకెట్‌ వేసుకున్నా’ అని చెబుతున్నాడు. మన దేశంలో ఎన్నికలంటే కేవలం విధాన నిర్ణేతలను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అదొక  ప్రజాస్వామ్య ఉత్సవం. అదెన్నో రకాలుగా వన్నెలీనుతుంది. వివిధ వర్ణాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. ఆ ఉత్సాహానికి అవధుల్లేవు. అది రోజు రోజుకూ కొత్త పోకడలు పోతోందనడానికి ఈ నడుస్తోన్న ట్రెండే నిదర్శనం.

మరిన్ని వార్తలు