సెప్టెంబర్‌ మొదటి వారం అత్యంత కీలకం!

24 Aug, 2018 18:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అసెంబ్లీ రద్దు అనేది ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే చెబుతానని తెలిపారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు..సిద్ధంగా ఉండండని పార్టీ నాయకులకు, శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తోంది..మీరు ప్రజల్లోకి వెళ్లండి..ప్రభుత్వం చేసింది చెప్పండని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభలో ఎన్నికల శంఖారావం మోగిస్తామని వెల్లడించారు.

ఆ సభకు 25 లక్షలకు పైగా జన సమీకరణ జరగాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు దడ పుట్టేలా సభ జరగాలని అన్నారు. సెప్టెంబర్‌లోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు.

సెప్టెంబర్‌ మొదటి వారం అత్యంత కీలకం
100 నియోజకవర్గాల్లో 50 రోజుల పాటు కేసీఆర్‌ ప్రచారం నిర్వహించనున్నారు. అసెంబ్లీ రద్దుపై న్యాయ నిపుణులతో ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ మొదటి వారం అత్యంత కీలకం కాబోతోంది. కాగా, సిట్టింగ్‌ ఎమ్మెల్లో ఐదారుగురు తప్ప మిగతా వారు బాగానే పనిచేస్తున్నారని సమావేశంలో కేసీఆర్‌ వెల్లడించారు. ఆ ఐదారుగురు కూడా ప్రజల మధ్య ఉంటే ఇబ్బంది ఉండదని, వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయం తనకు వదిలేయాలని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు