73.2% రికార్డు పోలింగ్‌

9 Dec, 2018 02:04 IST|Sakshi
పోలింగ్‌ వివరాలను వెల్లడిస్తున్న ఈసీ రజత్‌ కుమార్‌

2014తో పోల్చితే 3.7% ఎక్కువ ఓటింగ్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ వెల్లడి

మధిరలో అత్యధికంగా 91.65%.. 

చార్మినార్‌లో అత్యల్పంగా 40.18%

గతం కంటే 103 స్థానాల్లో పెరిగిన పోలింగ్‌... 99.74% పోలింగ్‌తో దేవరకద్ర మహిళల రికార్డు

39 చోట్ల 85 శాతానికి మించిన మహిళల పోలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన పూర్తి పోలింగ్‌ శాతాల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ శనివారం రాత్రి ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 67.7% పోలింగ్‌ జరిగిందని శుక్రవారం రాత్రి ప్రాథమిక అంచనాలను ప్రకటించారు. కాగా.. 2014 శాసనసభ ఎన్నికల్లో నమోదైన 69.5% పోలింగ్‌తో పోల్చితే ఈసారి ఎన్నికల్లో 3.7% పోలింగ్‌ పెరిగింది.

అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65% నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చార్మినార్‌లో అత్యల్పంగా 40.18% పోలింగ్‌ జరగ్గా ఆ తర్వాతి స్థానాల్లో 41.24 శాతంతో యాకుత్‌పురా, 42.74 శాతంతో మలక్‌పేట, 44.02 శాతంతో నాంపల్లి, 45.61 శాతంతో జూబ్లీహిల్స్, 46.11 శాతంతో చాంద్రాయణగుట్ట, 49.05 శాతంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే 90.95% పోలింగ్‌తో యాదాద్రి–భువనగిరి జిల్లా తొలిస్థానంలో నిలవగా 48.89% ఓటింగ్‌తో హైదరాబాద్‌ జిల్లా చివరన నిలిచింది. అత్యల్ప ఓటింగ్‌ స్థానాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి

.

103 స్థానాల్లో పెరిగిన ఓటింగ్‌ !
2014 శాసనసభ ఎన్నికలతో పోల్చితే తాజాగా జరిగిన ఎన్నికల్లో 103 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం పెరిగింది. గతంతో పోల్చితే కేవలం 16 స్థానాల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్‌ పెరగగా, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర మరి కొన్ని పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. దేవరకద్ర నియోజకవర్గంలో అత్యధికంగా 99.74% మహిళలు ఓటేసి రికార్డు సృష్టించారు. ఇక్కడ పురుషుల పోలింగ్‌ శాతం కేవలం 69.32 మాత్రమే కావడం గమనార్హం.

మధిరలో పురుషలు అత్యధికంగా 92.54% ఓటేయగా, ఇక్కడి మహిళలు కూడా పురుషులతో పోటాపోటీగా 90.8% ఓట్లు వేయడంతో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్‌ జరిగిన నియోజకవర్గంగా మధిర నిలిచింది. పురుషులతో పోలిస్తే మహిళలు 44 నియోజకవర్గాల్లో అధికసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. 32 స్థానాల్లో పురుషులు 85% ఓటు హక్కు వినియోగించుకోగా, 39 చోట్లలో మహిళలు పోలింగ్‌ 85% కన్నా అధికంగా జరిగింది. అదేవిధంగా ఇతరులు (ట్రాన్స్‌జెండర్లు) ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోని కేవలం 55 నియోజకవర్గాల్లో వీరు మాత్రమే ఓటు వేయగా, రెండు చోట్ల వారి ఓట్లు లేవు. మిగిలిన 62 స్థానాల్లో ఓటు నమోదు చేసుకున్నప్పటికీ ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. బహదూర్‌పుర, బోథ్, మానకొండూరు, నియోజకవర్గాల్లో ట్రాన్స్‌జెండర్లు 100% ఓటు వేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు