రెండు తాళం చెవులు

9 Dec, 2018 02:02 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

త్రీహిల్స్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ నుంచి ఫోన్‌కాల్‌ అందుకున్న వెంటనే సిబ్బందితో అక్కడకు వెళ్లాడు క్రైమ్‌ ఎస్సై కాళిదాస్‌.గత రాత్రి హాస్పిటల్‌లో చేరిన రాజారావు మరణించాడు. సూర్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.వాళ్లిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నాడు క్రైమ్‌ ఎస్సై కాళిదాస్‌.వెంటనే డీలక్స్‌ హోటల్‌కు చేరుకున్నాడు. హోటల్‌ సిబ్బంది ద్వారా వివరాలను సేకరించాడు. రాజారావు, సూర్యంల గురించి సమాచారం తెలుసుకున్నాడు. ముందురోజు రాత్రి హోటల్‌లో వెట్‌ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో పాల్గొన్న వాళ్లంతా ప్రముఖుల కొడుకులని, రాజారావు వీరభద్రం కొడుకని, రోహిత్‌ పుల్లారావు కొడుకని, వీరభద్రం, పుల్లారావు రాజకీయ ప్రత్యర్థులని తెలుసుకున్నాడు కాళిదాస్‌. కిందటి సంవత్సరం పుల్లారావు, వీరభద్రం వ్యాపార గొడవలతో ఒకరినొకరు రివాల్వర్స్‌తో కాల్చుకుని మరణించారు. ఆ కేసు ఇంకా పూర్తి కాకుండానే ఈ సంఘటన జరిగింది. డీలక్స్‌ హోటల్‌ రూమ్‌ నంబర్‌–111లోకి తన సిబ్బందితో సహా ప్రవేశించాడు ఎస్సై కాళిదాస్‌.ఏఎస్సై శంకరం ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించాడు.గదిలోని టేబుల్‌ మీద గాజు గ్లాసులు ఉన్నాయి. పెద్ద సోఫాకు రెండు వైపులా పూలకుండీలు ఉన్నాయి. కుడివైపు పూలకుండీలో ఉన్న మట్టి కొంతతడిగా ఉంది. ఆ మట్టిని కొంత సేకరించి, ల్యాబ్‌కు పంపాడు శంకరం. ఆ గదిలో మూలన పడి ఉన్న హెరాయిన్, గంజాయిని కూడా సేకరించాడు.గది ముందు నిలుచున్న రూమ్‌బాయ్‌ని పిలిచాడు ఎస్సై కాళిదాస్‌.

‘‘నీ పేరు’’‘‘అప్పారావు సార్‌’’‘‘నిన్న రాత్రి ఈ రూమ్‌లో ఎవరెవరు ఉన్నారో చెప్పగలవా?’’ ప్రశ్నించాడు కాళిదాస్‌.‘‘ఈ కుడి పక్కనున్న పూలకుండీ పక్కనే డాలీ మేడమ్, ఆమె పక్కన రాజారావు గారు, సూర్యంగారు, అక్బర్‌గారు, రోహిత్‌గారు కూర్చున్నారు’’ చెప్పాడు అప్పారావు.‘‘వాళ్లందరూ నీకు బాగా పరిచయమా?’’ ప్రశ్నించాడు కాళిదాస్‌.‘‘వాళ్లంతా ప్రతివారం రాత్రివేళ ఇక్కడ మందు పార్టీ చేసుకుంటుంటారు. వాళ్లకు కావలసినవి నేనే తెచ్చేవాణ్ణి. అందువల్ల వాళ్లందరితోనూ బాగా పరిచయం అయిందండీ’’ బదులిచ్చాడు అప్పారావు.‘‘వెరీగుడ్‌ అప్పారావు. వాళ్ల అడ్రస్‌లు చెప్పగలవా?’’ అడిగాడు కాళిదాస్‌.అప్పారావు చెప్పిన అడ్రస్‌లు రాసుకుని, వాళ్ల నుంచి రక్త నమూనాలు సేకరించాడు కాళిదాస్‌.రెండు గంటల తర్వాత–‘‘రాజారావు మరణం సహజమైనది కాదు. ప్రీప్లాన్డ్‌ మర్డర్‌.’’ అన్నాడు కాళిదాస్‌.‘‘మీరెలా చెప్పగలరు?’’ అడిగాడు శంకరం.ఆ పార్టీలో పాల్గొన్న వారి రక్తంలో ఎంతో కొంత విస్కీ, హెరాయిన్‌ ఉన్నట్లు రక్తపరీక్షల్లో తేలింది. డాలీ రక్తంలో మాత్రం విస్కీ లేదని, ఆమె తాగలేదని తేలింది. ఆమె గ్లాసులోని విస్కీని తెలివిగా పక్కనే ఉన్నపూలకుండీలో పోసేసింది. రాజారావు తాగిన విస్కీలో హెరాయిన్‌ మోతాదుకు మించి ఉంది. రాజారావు చేత డాలీ ఎక్కువగా తాగించిందన్న మాట శంకరం... ఇదీ కథ’’ అన్నాడు కాళిదాస్‌.

మంచం మీద అచేతనంగా పడి ఉంది డాలీ.ఆమె వద్దకు వెళ్లి తట్టి చూశాడు కాళిదాస్‌. చల్లగా తగిలింది. ఆమె మరణించిందని గ్రహించాడు. ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆమె కుడిచేతి గోళ్లకు రక్తంమరకలు ఉండటాన్ని గమనించాడు. మరణానికి ముందు ఆమె ఎవరితోనో పోరాడినట్టుగా గ్రహించాడు. ఆమె మెడపై గాయం ఉంది. ఆమె మెడలోని గొలుసును బలవంతంగా లాగినట్టు మెడపై ఎర్రని గీతఉంది. డాలీ శరీరం నీలం రంగులోకి మారింది. వెంటనే ఆమె శరీరాన్ని పోస్ట్‌మార్టంకు పంపాడు.ఆ తర్వాత కాళిదాస్‌ అక్కడి నుంచి రాజారావు ఇంటికెళ్లి గదిలో ఉన్న కబోర్డు తెరిచాడు. లోపల ఒక కర్రపెట్టెఉంది. ఆ పెట్టెపై ‘626’ అని రాసి ఉంది. ఆ పెట్టె తెరవాలనుకున్నాడు. ఆ పెట్టె తాలూకా తాళంచెవి కోసం గదంతా గాలించాడు. పావుగంట తర్వాత మంచం కింద తాళంచెవి కనిపించింది.
‘శంకరం! ఈ పెట్టెకు రెండు తాళంచెవులు ఉన్నాయి. ఈ తాళంచెవి డూప్లికేట్‌. రెండో తాళంచెవి మాయమైంది. ఈ రెండు హత్యలకు, ఈ పెట్టెకు లింక్‌ ఉంది. కనుక్కుంటాను. పెట్టెలో ఉన్నది ఈ తాళంచెవితోతెరిచి తెలుసుకుంటాను. ముందు సూర్యం దగ్గరకెళదాం. అతడికి స్పృహ వచ్చాక మనకు అన్నీ తెలుస్తాయి’’ అన్నాడు కాళిదాస్‌.

‘‘మనం అనుకున్న ప్రకారం కథ ఫలించిందా?’’ అడిగింది ప్రియ.‘‘పురిట్లోనే సంధికొట్టినట్టుగా ఆగిపోయింది ప్రియా!’’ నిరాశగా బదులిచ్చాడతడు.‘‘డాలీ వద్దనున్న తాళంచెవిని నువ్వు తెచ్చావుగా’’ అంది ప్రియ.‘‘ఏం లాభంలేదు. కర్రపెట్టె రాజారావు ఇంట్లో ఉంది. బహుశ రెండో తాళంచెవి సూర్యం దగ్గర ఉండాలి’’ అన్నాడతడు.‘‘రాజారావు, సూర్యం తండ్రులు శత్రువులు కదా! మరి వాళ్ల కొడుకులు స్నేహితులెలా అయ్యారు.. అదే నాకు అర్థం కావడంలేదు’’ అంది ప్రియ.‘‘మైడియర్‌ ప్రియా! రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయి. ముందు నువ్వువెంటనే హాస్పిటల్‌కెళ్లి సూర్యాన్ని పరలోకానికి పంపు’’ అని ఆమెకు ప్లాన్‌ వివరించాడతడు. ఇద్దరూ గదిలోంచి బయటకు వెళ్లారు.

ఒక డాక్టర్, నర్సు సూర్యం ఉన్న గదిలోకి ప్రవేశించారు. డాక్టర్‌ కోటు జేబులోంచి సిరెంజ్‌ తీశాడు. అందులో ఉన్న మందువైపు చూసి సూర్యం మంచం వద్దకొచ్చాడు. సూర్యం మీద దుప్పటి కప్పి ఉంది. సూర్యానికి ఇంజెక్షన్‌ చేయబోయాడు.అంతలోనే డాక్టర్‌ మొహమ్మీద బలమైన పిడికిలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు డాక్టర్‌ నేల మీదకు ఒరిగిపోయాడు. ఒక్కసారి ఆ గదిలో వెలుతురు మాయమైంది. దుప్పటి తొలగించి మంచం మీద నుంచి నేల మీదకు గెంతాడు అతడు.‘‘శభాష్‌ శంకరం’’ కంగుమంది ఎస్సై కాళిదాస్‌ గొంతు.‘‘రోహిత్‌! లే.. నీ డ్రామాకు తెరపడింది.’’ అంటూ గద్దించాడు. రోహిత్‌ నిరుత్తరుడయ్యాడు.‘‘రాజారావును నువ్వే హత్య చేశావు. తర్వాత డాలీని హత్య చేశావు. ఆమె మెడలోని చెయిన్‌కు ఉన్న తాళంచెవిని బలవంతంగా తీసుకున్నావు. నీ చేతి మీద కనిపిస్తున్న గాయాల గుర్తులు డాలీ నిన్ను గోళ్లతో రక్కినవే! ఈ ఆధారాలు చాలా! ఇంకేమైనా కావాలా? నువ్వు వెదుకుతున్న పెట్టె నా అధీనంలో ఉంది. అందులో రాజారావు తండ్రి వీరభద్రం, సూర్యం తండ్రి పుల్లారావుల నల్లడబ్బు తాలూకా వివరాలు రాసి ఉన్న పత్రాలు ఉన్నాయి. రెండు తాళంచెవులు వీరభద్రం, పుల్లారావులవి. ఒక తాళంచెవి ఇప్పుడు నీవద్ద, మరొకటి నావద్ద ఉన్నాయి. ఆ పత్రాల కోసమే నువ్వు ఈ హత్యలు చేశావు. పద పోలీస్‌ స్టేషన్‌కి... సెల్‌ సిద్ధంగా ఉంది’’ అంటూ రోహిత్‌ను అదుపులోకి తీసుకుని జీపెక్కించాడు ఎస్సై కాళిదాస్‌.
- రాణీ మోహన్‌రావ్‌ 

మరిన్ని వార్తలు