తుది దశ ముగిసే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ వద్దు

24 Mar, 2019 05:06 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తుదిదశ పోలింగ్‌లో (మే 19న) ప్రజలు ఓటు వేసే గడువు ముగిసిన అర్ధగంట తర్వాత నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రసారం చేయొచ్చని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రసారం, అభ్యర్థుల ప్రచారంపై ఈసీ శనివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. సాధారణంగా ప్రతీసారి మీడియా సంస్థలకు ఈ మార్గదర్శకాలను విడుదల చేస్తుండగా తొలిసారిగా వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలను ఈసీ ఈ జాబితాలో చేర్చింది.

ప్రతీ దశలో పోలింగ్‌ మొదలవ్వడానికి ముందు 48 గంటల సమయంలో అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన విన్నపాలు, అభిప్రాయాలు సహా ఏ రకమైన సమాచారాన్నీ పత్రికలు, టీవీలు, రేడియోలతోపాటు వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు ప్రసారం చేయకూడదనీ, ప్రచురించకూడదని ఈసీ స్పష్టం చేసింది.æ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని ఈసీ తెలిపింది. అలాగే ఎన్నికల తుది ఫలితాలను తాము అధికారికంగా విడుదల చేసే వరకు మీడియా సంస్థలు తుది ఫలితాలను ప్రసారం చేయకూడదని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకవేళ ప్రసారం చేయాలనుకుంటే ఆ ఫలితాలు అనధికారికమైనవనీ, పాక్షిక ఫలితాలనీ, వీటినే తుది ఫలితాలుగా భావించకూడదని ప్రేక్షకులను హెచ్చరించాలని ఈసీ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు