ఓటేస్తే శానిటరీ నాప్‌కిన్‌!

26 Apr, 2019 00:06 IST|Sakshi

ఓట్లు రాబట్టుకోవడం కోసం అభ్యర్ధులు ఓటర్లకు నగదు, వస్తువులు ఇస్తుంటారు. ఇది అనధికారికంగా, రహస్యంగా జరిగే పని.అయితే,ముంబై శివారులోని మహిళా పోలింగు కేంద్రాల్లో ఓటు వేయడానికి వచ్చే మహిళలకు ‘శానిటరీ నాప్‌కిన్స్‌’ ఇవ్వనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌ 29న పోలింగు జరిగే ఈ‘శక్తి మతదాన్‌ కేంద్ర’(మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం)లకు ఓటు వేయడానికి వచ్చే వారందరికీ వీటిని ఇస్తారు. ఓటు వేసేందుకు మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా సుహృద్భావ కానుకగా ఈ శానిటరీ నాప్‌కిన్‌లను ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మహిళా ఓటర్లకు ఎన్నికల సంఘం శానిటరీ నాప్‌కిన్‌లను ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి. సబర్బన్‌ ముంబై నియోజకవర్గంలోని 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో శక్తి మతదాన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్క మహిళకు బహుమతి ఇస్తామని అధికారులు వివరించారు. అంతే కాకుండా ఈ పోలింగు కేంద్రాల్లో ఓటు వేసే వారికి కూల్‌డ్రింకులు కూడా సరఫరా చేస్తామని చెప్పారు. మహారాష్ట్రలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు  ఈ నెల 29న పోలింగు జరుగుతుంది.

మరిన్ని వార్తలు