పాల్‌.. కేఏ పాల్‌ 

29 Mar, 2019 10:08 IST|Sakshi

ఎన్నికల సిత్రం

రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకి పొద్దున్నే ఫోనొచ్చింది. ‘‘గుడ్మాణింగ్‌ బాబుగారూ.. చెప్పండి’’ అన్నాడు.  
‘‘మైండ్‌ దొబ్బిందా? బాబు గొంతేదో, కేయేపాల్‌ గొంతేదో గుర్తుపట్టలేదా?’’ అన్నాడు పాల్‌.  ‘‘ఓ.. పాల్‌ గారా.. చెప్పండి. కానీ కాస్త మర్యాదగా చెప్పండి’’ అన్నాడు. పాల్‌కి మండిపోయింది.  
‘‘మర్యాదా! నీకా!! బాబుకు రెస్పెక్ట్‌ ఇస్తున్నాను కదా అని బాబు పక్కన ఉండే ప్రతి తొక్కలో గాడికీ రెస్పెక్ట్‌ ఇవ్వను’’ అన్నాడు. 
‘‘పాల్‌ గారూ.. మర్యాద ప్లీజ్‌. ముందిది చెప్పండి. బాబుగారి పక్కన ఉంటున్నానని మీకు నా మీద రెస్పెక్ట్‌ లేదా? బాబుగారి పక్కన లేకున్నా కూడా మీకు నా మీద రెస్పెక్ట్‌ ఉండక పోయేదా?’’  
‘‘అంటే ఏంటి! ‘బాబు దగ్గర నువ్వుండబట్టే నీ మీద రెస్పెక్ట్‌ లేదు కుటుంబరావ్‌’ అని నేను అంటే.. అప్పుడు నువ్వు రెస్పెక్టబుల్‌ పర్సన్‌గా ఫీలవుతావా.. ఐ హ్యావ్‌ మై ఓన్‌ రెస్పెక్ట్‌ అని?’’ అన్నాడు పాల్‌.  కుటుంబరావ్‌ కాగితాలు ఎగిరిపోయాయి.  
‘‘ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్‌ చేశారు పాల్‌ గారూ. ఏమిటి మీకూ నాకూ ఉన్న సంబంధం?’’ అన్నాడు. 
‘‘సంబంధం లేదని నువ్వు అనుకున్నావ్‌ కాబట్టే సంబంధం లేకుండా నా మీద సెటైర్‌లు వేస్తున్నావ్‌. వెళ్లి చంద్రబాబుని అడుగు.. మీ పార్టీకి, మా పార్టీకి ఉన్న సంబంధం ఏమిటో? ప్రణాళికలు వేస్తూ కూర్చోవడం కాదు కుటుంబరావ్‌... కాస్త పొలిటికల్‌ నాలెడ్జి కూడా ఉండాలి..’’ అన్నాడు పాల్‌.  
‘‘ప్రణాళికలు వేయడానికి పొలిటికల్‌ నాలెడ్జి ఎందుకు పాల్‌ గారూ..’’ 
‘‘ఎందుకా! నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి ఏమన్నావ్‌? బాబుగారు ప్యాకేజీకి ఒప్పుకోలేదు. హోదాకి సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే అందుకు ఒప్పుకున్నారు అని కదా అన్నావ్‌. నాలెడ్జ్‌ లేకపోవడం అంటే ఇదే కుటుంబరావ్‌! చంద్రబాబు వెనకేసుకోడానికి ప్యాకేజ్‌ తెచ్చుకుంటే, నువ్వు చంద్రబాబుని వెనకేసుకొచ్చే ప్యాకేజీ తీసుకున్నట్లున్నావ్‌. హోదాకి ప్యాకేజీ సమానమని వాళ్లు అన్నారే అనుకో. సమానమైనప్పుడు హోదానే ఇవ్వొచ్చు కదా మీ బాబుగారు అడగాలి కదా..’’ 
‘‘ఓ.. అదా మీ కోపం పాల్‌ గారూ!’’ 
‘‘నేను చెప్పానా కుటుంబరావ్‌.. అదే నా కోపం అని!! చంద్రబాబు ఏది ఎందుకు చేశాడో నువ్వే చెబుతావ్, నాకు కోపం ఎందుకొచ్చిందో కూడా నువ్వే ఊహించుకుంటావ్‌’’ అన్నాడు పాల్‌.  కుటుంబరావు కాగితాలు మళ్లీ ఎగిరిపోయాయి. 
‘‘కాసేపు మౌనం పాటించమంటారా పాల్‌ గారూ.. మీ కోపం తగ్గడానికి?!’’ అన్నాడు. 
‘‘ఆ మౌనం నిన్ననే పాటించాల్సింది కుటుంబరావ్‌. నీకు బీజేపీ అంటే పడదు. ఓకే. కన్నా లక్ష్మీ నారాయణ అంటే పడదు. ఓకే. కన్నాకు డిపాజిట్‌ దక్కితే పదిలక్షలు బంపర్‌ ఆఫర్‌ అన్నావ్‌. ఒకే. బీజేపీకి ఓట్లే పడవన్నావ్‌. అదీ ఓకే. అక్కడితో ఆగావా?! బీజేపీ కన్నా ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు పడతాయ్‌ అన్నావ్‌! అంత చీప్‌ అయిపోయిందా కుటుంబరావ్‌ మా పార్టీ! దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, మూర్ఖులు.. ఎన్ని సెటైర్‌లు వేసినా రేపొచ్చే గర్నమెంటు మాదే. స్టేట్‌లో ప్రజాశాంతి పార్టీ జెండా ఎగరేస్తుంది చూడు. నిన్ను క్షమిస్తున్నా. మళ్లీ ఏవో కాగితాలు పట్టుకొచ్చి ప్యాకేజ్‌ ప్రెస్‌మీట్‌లు పెట్టకు. సరేనా’’ అని ఫోన్‌ పెట్టేశాడు పాల్‌.  
ఎగిరిపోయిన ప్యాకేజీ కాగితాలు ఏరుకునే పనిలో పడిపోయాడు కుటుంబరావు.  

– మాధవ్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు