ఫేస్‌బుక్‌ పోస్ట్‌..‘సీ విజిల్‌’ అలర్ట్‌

14 Mar, 2019 09:26 IST|Sakshi
సి విజిల్‌

రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఎన్నికల నియమావళిని 2013 నుంచి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప చేశారు. కానీ తగిన యంత్రాంగం లేక సామాజిక మాధ్యమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫేస్‌బుక్‌పై కొరడా ఝుళిపించింది. పాకిస్తాన్‌ సైన్యానికి పట్టుబడి విడుదలయిన వైమానిక దళం పైలట్‌ అభినందన్‌తో బీజేపీ నేతలు ఉన్న రెండు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఈసీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. ఆ పోస్టర్లలో అభినందన్‌తో పాటు బీజేపీ నేతలు మోదీ, అమిత్‌ షా, ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ శర్మ తదితరులు ఉన్నారు.

అభినందన్‌ను, మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిని మార్చి 1న ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి చెందిన ‘సి విజిల్‌’ యాప్‌కు ఫిర్యాదు అందింది. పరిశీలించిన ఎన్నికల సంఘం సైనికుల ఫొటోలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం నియమావళికి విరుద్ధం కాబట్టి ఆ పోస్టర్లను ఉపసంహరించుకోవాలని ఫేస్‌బుక్‌ భారత్, దక్షిణాసియా డైరెక్టర్‌ శివనాథ్‌ తుక్రాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాజకీయ ప్రచారం కోసం సాయుధ దళాల ఫొటోలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించినా కూడా చాలా పార్టీలు ముఖ్యంగా బీజేపీ బాలాకోట్‌ దాడి, అభినందన్‌ ఫొటోలను ఉపయోగించుకుంటోందని ద వైర్‌ పత్రిక పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా అభినందన్‌ విడుదలను ప్రచారానికి ఉపయోగించుకుంటోందని తెలిపింది.  

మరిన్ని వార్తలు