గంభీర్‌పై కేసు నమోదు

28 Apr, 2019 04:20 IST|Sakshi

అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీ నేపథ్యంలో...

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఢిల్లీలోని జంగ్పూరలో గురువారం గంభీర్‌ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు గంభీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసు చట్టంలోని 28/110 సెక్షన్ల కింద గంభీర్‌పై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సౌత్‌ఈస్ట్‌) చిన్మయి బిశ్వాల్‌ శనివారం మీడియాకు తెలిపారు. దీనిపై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్‌ ఖురానా స్పందిస్తూ...నాటి ర్యాలీపై గంభీర్‌ సంబంధిత అధికారులనుంచి అనుమతి తీసుకున్నారని, అయితే ఆ ర్యాలీని నిర్దేశిత సమయానికి మించి పొడిగించారని తెలిపారు. దీనిపై పార్టీ న్యాయ విభాగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.  గంభీర్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో అవాస్తవాలు/ వ్యత్యాసాలున్నాయని, రెండు చోట్ల ఓటు గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని చట్ట రీత్యా ఇది నేరమని ఆప్‌ అభ్యర్థి అతీషీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు