లక్కీ స్వీట్స్‌

8 Apr, 2019 12:20 IST|Sakshi

ఈ నియోజకవర్గాలే జాతకాన్ని తేల్చేది

కొన్నిచోట్ల ఎవరు గెలిస్తే వారిదే అధికారం

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, దాని భాగస్వామ్య పక్షాలు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటాయని ప్రధాని నరేంద్రమోదీనాయకత్వంలోని బీజేపీ ఆశాభావంతో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద
ఎన్నికల ప్రక్రియ దేశంలో ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమై, మే 19 వరకు,ఏడు దశల్లో కొనసాగనుంది. మే 3న జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీల భవిష్యత్తు తేలిపోనుంది.

ఎన్నికల ముందు జరిగే ఒపీనియన్‌ పోల్స్, ఎన్నికల తరువాత జరిగే ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్నికల చర్చనీయాంశాలైనప్పటికీ, చారిత్రక ఎన్నికల డేటా మాత్రం కచ్చితంగా ఎవరు అధికారంలోకి వస్తారో కొన్నిసార్లు ముందుగానే తేల్చి చెబుతాయంటున్నారు ఎన్నికల నిపుణులు. దేశంలోని కొన్ని నియోజకవర్గాల్లోని గెలుపోటములే అధికారం ఎవరి వశమవబోతోందో తేల్చి చెప్పే ‘లక్కీ నియోజకవర్గాలు’ అని విశ్లేషకులు భావిస్తారు. అందుకే ఎన్నికలకు ముందే ఆయా నియోజకవర్గాల్లో ఓటు ఎవరికి పడనుందో తేల్చి చెప్పడం ద్వారా ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేదెవరో అంచనా వేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఒపీనియన్‌ పోల్స్‌తోనూ, ఎగ్జిట్‌ పోల్స్‌తోనూ సంబంధం లేకుండానే కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలను, ఓటర్ల మనోగతాన్ని బట్టి ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.

ఈ రెండుచోట్లా గెలిచినోళ్లదే ‘సెంటర్‌’
ఒక నిర్వచనం ప్రకారం ఏ రాజకీయ పార్టీకైతే ఆ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు దక్కుతాయో దాన్నే జయాపజయాలను నిర్ణయించే నియోజకవర్గంగా చెబుతుంటారు. అయితే దీనికి శాస్త్రబద్ధత లేనప్పటికీ అవి ప్రతి ఎన్నికల్లోనూ ఒక ట్రెండ్‌ని మాత్రం తెలియజేస్తాయి. అయితే ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే ఈ నియోజకవర్గాల్లో ప్రజల నాడిని అర్థం చేసుకుంటే చాలునన్నది వీరి అంచనా. గెలుపోటముల్లో ఇటువంటి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోన్న నియోజకవర్గాలు జాతీయ స్థాయిలో కొన్ని మాత్రమే ఉన్నాయి. 1977 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలనే ఇచ్చిన నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. 1977 నుంచి, ఇలా అధికారాన్ని అప్పగించిన అదృష్ట నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. గత 11 లోక్‌సభ ఎన్నికల్లోనూ కింది రెండు నియోజకవర్గాల్లో గెలుపు కైవసం చేసుకున్న పార్టీనే కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అవి..

వల్సాద్‌ (గుజరాత్‌) ∙పశ్చిమ ఢిల్లీ (ఢిల్లీ)ఇక్కడ గెలిస్తే అధికారం హస్తగతమే..గత 11 లోక్‌సభ ఎన్నికల్లో 10 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది ఈ కింది స్థానాల్లో గెలిచిన పార్టీలే.
బీడ్‌ (మహారాష్ట్ర) ∙చండీగఢ్‌ (చండీగఢ్‌)
ఫరీదాబాద్‌ (హరియాణా)
గురుగాం (హరియాణా)
నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ (ఢిల్లీ) ∙పలామూ (జార్ఖండ్‌)
రాంచీ (జార్ఖండ్‌) ∙షాదోల్‌ (మధ్యప్రదేశ్‌)

అంచనా ఎలా?
2008లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ భారీ స్థాయిలో జరిగింది. ఫలితంగా అనేక నియోజకవర్గాలకు చెందిన సరిహద్దులు మారాయి. పాత నియోజకవర్గం, దానికున్న భౌగోళిక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గాలను పరిగణనలోనికి తీసుకున్నారు. ఉదాహరణకు బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. అందువల్ల పాత నియోజకవర్గమైన బెటియా ఎన్నికల సమాచారాన్ని ‘చంపారన్‌’ అంచనా వేసేందుకు పరిగణనలోనికి తీసుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలను ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రీపోల్‌ పొత్తుల్లో భాగంగా గెలిచిన పార్టీల వివరాలను కూడా ఈ అధ్యయనంలో కలిపారు. ఉదాహరణకు బీజేపీ భాగస్వామ్య పార్టీ శివసేన 2014 ఎన్నికల్లో నాసిక్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచింది. గతంలో బిహార్‌లో ఉన్న రాంచీ లోక్‌సభ స్థానం ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి.

1977 ఎన్నికలే ఎందుకు ప్రామాణికం?
1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యపై పరిమితి విధించారు. 1976 వరకు జనాభా వివరాల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండేవారు. 1952లో 489 స్థానాలుండగా, 1957, 1962 ఎన్నికల్లో 494 స్థానాలు, 1967 ఎన్నికల్లో 520 స్థానాలూ, 1971లో 518 స్థానాలు ఉండేవి. నూతన మార్గదర్శకాల ప్రకారం 1977లో జరిగిన ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను 542గా నిర్ణయించారు. 2008లో జరిగిన నియోజకవర్గాల మార్పులనుమినహాయిస్తే, 1977 నుంచి ఇవే సరిహద్దులుకొనసాగుతున్నాయి.

ఇక్కడ ఎవరు గెలిస్తే వారే..
గత 11 లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు కింది నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించిన పార్టీలే అ«ధికారంలోకి వచ్చాయి.
బనస్కాంఠా (గుజరాత్‌)
భిళ్వారా (రాజస్తాన్‌)
∙భివానీ (మహేంద్రగఢ్‌)
తూర్పు ఢిల్లీ (ఢిల్లీ)
గంగానగర్‌ (రాజస్తాన్‌)
జామ్‌నగర్‌ (గుజరాత్‌)
జునాగఢ్‌ (గుజరాత్‌)
కర్నాల్‌ (హరియాణా)
ఖంద్వా (మధ్యప్రదేశ్‌)
కురుక్షేత్ర (హరియాణా)
ఖుషీనగర్‌ (ఉత్తరప్రదేశ్‌)
మండీ (హిమాచల్‌ప్రదేశ్‌)
మాండ్లా (మధ్యప్రదేశ్‌)
నాసిక్‌ (మహారాష్ట్ర)
పశ్చిమ చంపారన్‌ (బిహార్‌)
పోర్‌బందర్‌ (గుజరాత్‌)
సుందర్‌గఢ్‌ (ఒడిశా)
వారణాసి (ఉత్తరప్రదేశ్‌)
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ నియోజకవర్గాలన్నీ ఉత్తర భారతానికి చెందిన హిందీ హార్ట్‌ల్యాండ్‌వే. ప్రాంతీయ పార్టీల పునాదులు బలంగా ఉన్న దక్షిణ భారతదేశం నుంచి ఒక్క నియోజకవర్గం కూడా దేశంలో పవర్‌లోకి వచ్చే పార్టీని నిర్ణయించే 28 లక్కీ నియోజకవర్గాల జాబితాలో లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు