జి.ఎస్‌.టి.. గంటా స్పెషల్‌ ట్యాక్స్‌

29 Mar, 2019 13:33 IST|Sakshi

వసూళ్లు, అక్రమాలు, దందాలే గంటా గ్యాంగ్‌ పని

దానికే జీఎస్టీ అని ఆయా నియోజకవర్గాల్లో పేరు

అందుకే ఆయన తడవకో నియోజకవర్గంలో పోటీ

ఇప్పుడు ఆ వంతు ఉత్తర నియోజకవర్గానిది

ఆ బాదుడు మాకొద్దంటున్న స్థానికులు

ఈ జీఎస్టీపైనే దృష్టి పెట్టిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజు

జీఎస్‌టీ.. అంటే గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌.. దీనిలోనూ సెంట్రల్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (సీజీఎస్‌టీ), స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌(ఎస్‌జీఎస్‌టీ) అని ఉంటాయి... దేశంలో అందరికీ తెలిసిన అర్ధాలు ఇవే.. కానీ విశాఖ జిల్లాలో మాత్రం జీఎస్‌టీ అర్ధం వేరు.. ఇక్కడ జీఎస్టీ అంటే గంటా స్పెషల్‌ ట్యాక్స్‌..  ఔను.. ఇది ముమ్మాటికీ నిజం.. అది మంత్రి గంటా శ్రీనివాసరావు స్పెషల్‌ టాక్సే..!

ఇంకా ఏమైనా అనుమానముందా?.. అయితే గతంలో ఆయన ప్రాతిని«ధ్యం వహిం చిన అనకాపల్లి, చోడవరం.. ప్రస్తుతం ప్రాతి నిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గాల్లో ఎవరినైనా అడగండి.. గంటా పురాణం ’గరుడ’ పురాణం కంటే పెద్దదని చెబుతారు.

ఇంతకీ గంటావారి జీఎస్టీ ఏమిటంటే.. ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో గంటా గ్యాంగ్‌గా చెప్పుకొనే అనుచరగణం నిర్మాణదారులు, భూయజమానులు.. ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ వసూళ్లు, భూకబ్జాలకు పాల్పడుతూ అడ్డంగా దోచేసుకోవడాన్నే ఆయా ప్రాంతాల్లో జీఎస్టీగా పరిగణిస్తున్నారన్నమాట. అందుకే ఒకసారి పోటీ చేసిన చోట మళ్లీ ముఖం చూపించలేని పరి స్థితిలో గంటా నియోజకవర్గాలు మారుతుంటారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గంటా గ్యాంగ్‌ జీఎస్టీ దెబ్బ తాజాగా ఆయన్ను విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తరిమింది. వాస్తవానికి తొలుత భీమిలి నుంచే పోటీ చేయాలని ఆయన భావించారు. స్వయంగా ఎల్లో మీడియానే భీమిలిలో ఆయన పరిస్థితి బాగోలేదని, ఐదేళ్ళకాలంలో భూ కుంభకోణాలతో అప్రతిష్ట మూటకట్టుకున్నారని పుంఖాను పుంఖాలు రాసేసింది. అప్పట్లో చంద్రబాబే స్వయంగా అలా రాయించాడని నొచ్చుకుని అలకపాన్పు ఎక్కిన గంటా తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి అప్పటికి పార్టీ అధిష్టానంతో ఓకే అనిపించుకున్నారు. ప్రత్యర్ధి ఎవరైనా సరే లక్ష మెజారిటీతో గెలుస్తానని సీట్ల ఖరారు ముందు వరకూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. ఎప్పుడైతే అవంతి శ్రీనివాసరావు భీమిలి బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారో.. అప్పుడే గంటా భీమిలి నుంచి మూటాముల్లే  సర్దేసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ అధిష్టానం కూడా ఈయన్ను విశాఖ ఎంపీగా పంపించి జిల్లా రాజకీయాల నుంచి పక్కకు తప్పించాలని చూసింది. కానీ  సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ పంతం పట్టి మరీ విశాఖ ఎంపీ సీటు సాధించుకోవడంతో గంటాకి విశాఖ ఉత్తర నియోజకవర్గ సీటుకు మారారు.

గంటా అవినీతిపై విష్ణుచక్రం
ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్‌ రాజు.. గంటాపై నిప్పులు చెరుగుతున్నారు. గంటా వంటి నేతను ఎన్నుకుంటే ఉత్తర నియోజకవర్గాన్ని మొత్తం ఊడ్చేస్తారని ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారు. గంటా అక్రమాలు, భూదందాలే ప్రధాన అజెండాగా  విష్ణుకుమార్‌రాజు ప్రచారం సాగిస్తున్నారనేది ప్రస్తుత ’ఉత్తర’ రాజకీయాలు పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక గంటా సామాజికవర్గానికి చెందిన జనసేన అభ్యర్ధి పసుపులేటి ఉషాకిరణ్‌  పోటీ పెద్ద లెక్కలోకి రాదనే వాదనలు ఉన్నాయి. జనసేన, టీడీపీ రహస్య పొత్తులో భాగంగానే ఆమెకు అక్కడ సీటు ఇప్పించారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ మేరకు ఆమె పెద్దగా ఓట్లు చీల్చే పరిస్థితి లేదన్న ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఉషాకిరణ్, ఆమె భర్త మురళీ తీవ్రంగా ఖండిస్తూ.. ‘గంటా ఓటమి.. మా విజయమే ధ్యేయంగా పని చేస్తామని’ ప్రకటిస్తున్నారు. మురళీ మాటల్లో వాస్తవాలేమిటో కొద్దిరోజుల ప్రచారసరళి చూస్తే తేలిపోతుంది. ఇక  టీడీపీ శ్రేణులూ గంటా భారాన్ని తట్టుకోలేకమనే అంటున్నాయి. ఈ ఎన్నికల్లో  ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.. 2024లో ఎక్కడుంటాడో.. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో.. ఈయన్ని నమ్ముకుంటే మన పరిస్థితి ఏమిటి... అని తెలుగుదేశం క్యాడర్‌ సైతం గంటాకు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదనే చెబుతున్నారు. ఐదేళ్ళుగా ఈ సెగ్మెంట్‌ నుంచి పార్టీ  టికెట్‌ ఆశించి కోట్లు ఖర్చు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు గంటా దిగుమతిని జీర్ణించుకోలేక పైకి బాగానే ఉన్నా.. అంతర్గతంగా సహకరించడం లేదనే వాదనలే ఉన్నాయి. మొత్తం గా.. చూస్తే గంటా ‘దిగుమతి’ రాజకీయంపై మొహంమొత్తిన ప్రజలు ఈసారి ‘ఉత్త’చేతులతోనే పంపిం చేసే పరిస్థితే బలంగా ఉంది.

ఉత్తరంలోచుక్కలు
ప్రతి ఎన్నికల్లోనూ కుల లెక్కలు బేరీజు వేసుకుని బరిలోకి దిగే గంటా ఈసారి కూడా తన సామాజికవర్గ ఓట్లు గణనీయంగానే ఉన్న ఉత్తర నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. కానీ ఇప్పటివరకు రూరల్‌ నేపథ్యమున్న నియోజకవర్గాల్లో తన ’మార్కు’ రాజకీయాలు చూపించి ఎలాగోలా నెట్టుకొచ్చిన గంటాకు  పూర్తిగా నగర వాతావరణం కలిగిన ఉత్తర నియోజకవర్గంలో చుక్కలు కనిపిస్తున్నాయి. యువకుడిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా, మచ్చలేని వ్యక్తిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి కేకే రాజు తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందంజలో ఉన్నారు. ఇంటింటికీ తిరుగుతూ  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే జరిగే ప్రయోజనాలను, నవరత్నాల పథకాలను వివరిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు భూదందాలతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి. అరాచకాలను నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకువస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మీకు  ‘జీఎస్‌టీ(గంటా స్పెషల్‌ టాక్స్‌) కావాలా.. అభివృద్ధి కావాలా’.. ’అరాచకం కావాలా.. ప్రశాంతత కావాలా..’ అని కేకే రాజు చేస్తున్న ప్రచారానికి కుల, మత, వర్గాలు.. చివరికి పార్టీలకతీతంగా ఉత్తర నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.

మరిన్ని వార్తలు