గిడ్డిని నెట్టేశారు!

8 Aug, 2018 12:42 IST|Sakshi
ఆహ్వాన పత్రిక చివర్లో మిగతా ఎమ్మెల్యేలతోపాటు గిడ్డి ఈశ్వరి పేరు

ఆర్నెల్ల క్రితం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పతాకస్థాయిలో పరపతి

పార్టీ ఫిరాయించాక అధికార పార్టీలో ఆమెది అధోగతి

దాన్ని అక్షరబద్ధం చేసిన ఆదివాసీ ఉత్సవాల ఆహ్వాన పత్రిక

గిరిజన ప్రతినిధిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఆమెకు లభించని ప్రాధాన్యత

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :గిడ్డి ఈశ్వరి... ఆరున్నొక్క నెలల కిందట వరకు ఆమె ఓ రెబల్‌.. ఆమె పేరు చెబితే వణుకు..వైఎస్సార్‌సీపీ శాసనసభ్యురాలిగా ఏకంగా సీఎం చంద్రబాబును మొదలుకుని టీడీపీ నేతలందరినీ హడలెత్తించిన నేత...గత నవంబర్‌ నెలాఖరులో టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆమె పరిస్థితి అంతా గడ్డుగా తయారైంది. ఎమ్మెల్యేని చేసిన పార్టీకి డబ్బు, పదవుల కోసం ద్రోహం చేశావంటూ సొంత గిరిజనులే ఆడిపోసుకోవడం దరిమిలా ఏజెన్సీలో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు.చంద్రబాబు మీద ఇష్టం లేకపోయినా పదవి కోసమే వెళ్తున్నానని చెప్పిన వీడియో సాక్ష్యం బట్టబయలు మొదలు.. ఆస్తి కోసం రక్తసంబంధీకులపైనే రోడ్డుపైనే దాడి చేసి చేజేతులా పరువు తీసుకున్న వైనం వరకు ఆమెపై ఎన్నో వివాదాలుఫిరాయింపు ఎమ్మెల్యేగా టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నా కనీస గుర్తింపు ఇవ్వని వాస్తవంఇప్పుడిదంతా ఎందుకంటే... ఏజెన్సీలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరులోనే గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ వేడుకల్లో ఆమెకు ఏపాటి గుర్తింపు ఇస్తున్నారో, ఇవ్వనున్నారో ఆహ్వాన పత్రిక స్పష్టం చేసింది.

సహజంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించడం, వారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం రివాజు. ఒకవేళ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీకి చెందినప్పటికీ ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యే అధ్యక్షతనే కార్యక్రమం జరగాలి. కానీ ఇక్కడ గిడ్డి ఈశ్వరి ఏకంగా అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే. జరుగుతున్న కార్యక్రమం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం.. నిర్వహిస్తోంది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే ఆమెను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధికారిక ఆహ్వాన పత్రిక ముద్రించారు. 9వ తేదీ గురువారం పాడేరు జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే ఆదివాసీ దినోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తుండగా, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. వాస్తవానికి ఆమె అధ్యక్షతన జరగాల్సిన కార్యక్రమ ఆహ్వాన పత్రికలో జిల్లా ఎమ్మెల్యేల జాబితాలో మాత్రమే ఆమెకు చోటు కల్పించడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేగా ఆమె ప్రొటోకాల్‌ కోసం ఆర్నెల్లుగా పరితపిస్తున్నప్పటికీ ఎవ్వరూ ఏ స్థాయిలోనూ  పట్టించుకోవడం లేదనే దానికి ఆహ్వాన పత్రికే సాక్ష్యం.

మరిన్ని వార్తలు