ఒకేసారి 3 కీలక బిల్లులు

9 Jul, 2019 04:22 IST|Sakshi

సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మంత్రి కిషన్‌రెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఒకే రోజు మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ యాక్ట్‌ –2008ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును, అలాగే మానవ హక్కుల చట్టం –1993ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఇలా బిల్లులను ప్రవేశపెట్టడాన్ని విపక్ష సభ్యులు అధీర్‌ రంజన్‌ చౌదరి, శశిథరూర్, ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌ తదితరులు వ్యతిరేకించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును వ్యతిరేకించారు.

సంస్థలుగా కాకుండా వ్యక్తులు గానూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నిర్బంధించేందుకు వీలుగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, తీవ్రవాది అనే పేరుతో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునే ప్రమాదం ఉందని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మిగిలిన బిల్లులపైనా విభిన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయా సభ్యులు వ్యతిరేకించారు. అయితే మంత్రి కిషన్‌రెడ్డి ఆయా విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించబోదని, సంస్థలను నిషేధించినా వాటి నుంచి విడిపోయి బయటకు వచ్చి వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం తేవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఆధార్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం:  
ఆధార్‌ను స్వచ్చందంగా ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే ఆధార్‌ సవరణ బిల్లు–2019ను రాజ్యసభ ఆమోదించింది. గత వారం ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఫోన్‌ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ధ్రువీకరణకు ఆధార్‌ వివరాలను వాడుకునేందుకు తాజా ప్రతిపాదనల్లో ప్రభుత్వం వీలు కల్పించింది.

>
మరిన్ని వార్తలు