నిస్సారమైన బడ్జెట్‌: రాహుల్‌

2 Feb, 2020 04:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చాలా చప్పగా, నిస్సారంగా ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో ఏమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే.. మాటలే తప్ప చేతలు చేతకాని ప్రభుత్వమని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. పన్ను శ్లాబుల్లో గారడీ చేశారని, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అసలైన పరిష్కార మార్గాలు చూపలేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ బడ్జెట్‌లో యువతకు ఉద్యోగం కల్పించేందుకు ఎలాంటి వాస్తవికత, వ్యూహాత్మకమైన భావన ఏమీ కన్పించట్లేదు’అని పేర్కొన్నారు.

‘ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చెబుతున్నట్లు.. కొత్త సీసాలో పాత సారాయి పోసినట్లు ఉంది’అని ఆరోపించారు. ‘చాలా ఎక్కువ సేపు చదివిన బడ్జెట్‌ మాత్రమే కాదు.. అత్యంత నిస్తేజమైన బడ్జెట్‌ ఇది’అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఎద్దేవా చేశారు. ‘అచ్ఛే దిన్‌’ను కేంద్రం ఎలా వదిలిపెట్టిందో.. ఇప్పుడు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కూడా గాలికొదిలేసిందని ట్విట్టర్‌లో దుయ్యబట్టారు. పన్ను చెల్లింపుదారులను ఆరేళ్లుగా పీడించుకుని తిన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన విషయాన్ని ఇప్పుడు గుర్తించినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. అసలు బడ్జెట్‌ మొత్తంలో ఉద్యోగాల గురించి ఎక్కడా ఒక్క పదం కూడా లేకపోవడం గర్హనీయమని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మండిపడ్డారు.

మరిన్ని వార్తలు