అందుకే పాదయాత్ర మొదలు పెట్టా: వైఎస్‌ జగన్

15 Nov, 2017 20:14 IST|Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ: ప్రజల ప్రాణాలతో సీఎం చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగి రెండు రోజులైనా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. బోటు ప్రమాదం 22 మంది చనిపోయినా చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని అంటారని, రెండు రోజుల తర్వాతే మాట్లాడుతున్నానని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...
‘ఈ ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపి వదిలేసింది. ఘటనకు బాధ్యత వహించి ఒక్క మంత్రి కూడా రాజీనామా చేయలేదు. సాక్షాత్తు సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే బోటు మునిగిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదట. బోటుకు కూడా అనుమతి లేదట. అయినా టిక్కెట్లు అమ్మి అంతమందిని ఎందుకు బోటు ఎక్కించారు? ఇంత జరిగితే కమిషన్‌ వేసి చేతులు దులుపుకున్నారు.

గతంలో గోదావరి పుష్కారాల్లో 29 మంది చనిపోయారు. చంద్రబాబు సినిమా షూటింగ్‌లో హీరోగా కనిపించడం కోసం వీఐపీ ఘాట్‌లో స్నానం చేయకుండా ప్రజల ఘాట్‌లోకి వెళ్లారు. సీఎం వస్తున్నారని ప్రజలను ఆపేశారు. ఆ తర్వాత బాబు గంటసేపు స్నానం చేశారు. సినిమా షూటింగ్‌ తీస్తూ ఎఫెక్ట్‌ కోసం ఒకేసారి ప్రజలను వదిలారు. ఆ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యులు చంద్రబాబు కాదా అని అడుగుతున్నా? దీనిపై కమిషన్‌ వేశారు. ఆ రిపోర్ట్‌ ఏమైంది? కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై కమిషన్‌ వేశారు అది ఏమైంది? ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే యాక్షన్ తీసుకోలేదు. ఏది జరిగినా కమిటీ, కమిషన్‌ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇసుక, బొగ్గు, మద్యం.. ఇలా చంద్రబాబు చేయని మాఫియా లేదు.

రైతులు గిట్టుబాటుధర లేక అవస్థలు పడుతుంటే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వకుండా అవహేళన చేస్తున్నారు. అందుకే రైతులకు అండగా ఉండేందుకు పాదయాత్ర మొదలు పెట్టా. పింఛన్లు అందక అవ్వా, తాతలు ఇబ్బందులు పడుతుంటే తోడుగా ఉండేందుకు పాదయాత్ర ప్రారంభించా. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను అష్టకష్ట్రాలు పడతావుంటే వారి కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్ర ఆరంభించా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక బాధ పడుతున్న పేద విద్యార్థులకు తోడుగా నిలిచేందుకు పాదయాత్ర చేపట్టా. నవరత్నాలు ప్రకటించాం. ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తా. ఏమైనా మార్పులు చేయాల్సివుంటే సలహాలు ఇవ్వండి. మన మేనిఫెస్టోలో ప్రతి అక్షరం మీరు చెప్పిందే ఉంటుంది. చెప్పినవే కాకుండా చెప్పవని కూడా చేసి చూపిస్తాం. మార్పు తీసుకురావడం ఆశ్వీరదించాలని కోరుతున్నా’’

మరిన్ని వార్తలు